Aam Aadmi Party : పంజాబ్‌లో ఆప్‌ సక్సెస్ .. రైతుల మద్దతే ఎక్కువగా

Aam Aadmi Party : పంజాబ్‌లో ఆప్‌ సక్సెస్ ..  రైతుల మద్దతే ఎక్కువగా
Aam Aadmi Party : ఎన్నికల సింబల్‌కు తగ్గట్టుగానే ఆమ్‌ఆద్మీ పార్టీ ఊడ్చిపారేసింది. పంజాబ్‌లో అధికార పార్టీని అడ్రస్ లేకుండా చేసింది.

Aam Aadmi Party : ఎన్నికల సింబల్‌కు తగ్గట్టుగానే ఆమ్‌ఆద్మీ పార్టీ ఊడ్చిపారేసింది. పంజాబ్‌లో అధికార పార్టీని అడ్రస్ లేకుండా చేసింది. బీజేపీ, శిరోమణి అకాళీదళ్‌ ఇకపై చిన్నా చితకా పార్టీలు అనుకునేలా మార్చేసింది. ఢిల్లీని ఏలే రాజు పంజాబ్‌ రాజకీయాలపై ఈ రేంజ్‌లో పంజా విసురుతారని ఊహించలేదు. 2017 నుంచి పంజాబ్‌ పాలిటిక్స్‌లో పక్కా ప్లాన్‌తో వెళ్తున్న ఆప్ అధినేత కేజ్రీవాల్‌.. ఈ ఎన్నికల్లో ఏకంగా అధికారంలోకి వచ్చేశారు. గత ఎన్నికల్లో కేవలం 20 స్థానాలు గెలిచి రెండో స్థానానికి పరిమితమైన ఆప్.. ఈసారి అధికార పగ్గాలు చేపట్టేంతగా ఎదిగింది. ముఖ్యంగా పంజాబ్‌ రైతుల మద్దతు అందరి కంటే ఎక్కువగా ఆమ్‌ఆద్మీ పార్టీకే దక్కింది. ఈ విజయం వెనక కారణం రైతులే.

అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ కంటే ఆమ్‌ఆద్మీ పార్టీకి 20 శాతం ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇంత స్వీప్ చేయడానికి ప్రధానంగా కొన్ని అంశాలు కనిపిస్తున్నాయి. పంజాబ్‌ను 70 ఏళ్ల పాటు శిరోమణి అకాళీదళ్-బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే ఏలాయి. కాని అనుకున్నంత అభివృద్ధి జరగలేదనేది ఓటర్లు మనోగతం. దానికి నిదర్శనమే ఈ ఫలితం. ముఖ్యంగా మాల్వా ప్రాంత రైతులు మార్పు కోరుకున్నారు. దీనికి తగ్గట్టే అక్కడి రైతులు ఓ స్లోగన్ కూడా ఇచ్చారు. ఈసారి తమను మోసం చేయలేరని, కేజ్రీవాల్ సారథ్యంలోని భగవంత్‌మాన్‌ను గెలిపించుకుంటామని ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చారు. పైగా కేజ్రీవాల్‌ కూడా మాల్వా ప్రాంతానికి చెందిన వ్యక్తి భగవంత్‌ మాన్‌ను సీఎం అభ్యర్ధిగా ప్రకటించారు. అందులోనూ భగవంత్‌ మాన్‌ కూడా పంజాబ్‌లో బలమైన సామాజికవర్గంగా ఉన్న సిక్కు జాట్‌ వర్గానికి చెందిన వ్యక్తి. దీంతో అన్ని రకాలుగా ఆమ్‌ఆద్మీ పార్టీకి కలిసివచ్చింది.

ఢిల్లీ మోడల్‌ డెవలప్‌మెంట్‌ అందిస్తానన్న కేజ్రీవాల్‌ పిలుపును పంజాబ్‌ ఓటర్లు స్వీకరించారు. నాణ్యమైన చదువు, నాణ్యమైన, చవకైన వైద్యం, తక్కువ ధరకే విద్యుత్‌, వాటర్‌. ఈ నాలుగు అంశాలే ఢిల్లీ అభివృద్ధికి కారణం అంటూ చెప్పుకొచ్చారు కేజ్రీవాల్. పంజాబ్‌లో విద్యుత్ ధరలు అధికంగా ఉన్నాయి. ప్రభుత్వాసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలలను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఈ చదువు, వైద్యం, విద్యుత్, వాటర్‌ అంటూ హామీలివ్వడంతో ఓటర్లు ఆప్‌ వైపు చూశారు.

పంజాబ్‌లో ఆప్‌ విజయం వెనక ప్రధానంగా ఉన్నది యువత, మహిళా ఓటర్లే. పంజాబ్‌ మార్పు కోరుకునే వాళ్లంతా ఆప్‌కే పట్టం కట్టాలన్న స్లోగన్‌ వదిలారు కేజ్రీవాల్. ముఖ్యంగా వేళ్లూనికుని ఉన్న అవినీతిని పెకిలించి వేసేది ఆమ్‌ఆద్మీ పార్టీనే అని గట్టిగా చెప్పగలిగారు. పైగా ఎడ్యుకేషన్, ఎంప్లాయ్‌మెంట్‌ విషయంలో పూర్తి భరోసా ఇచ్చారు. మహిళల ఖాతాలో వేయి రూపాయలు వేస్తామని హామీ ఇచ్చారు. ఇది యువత, మహిళలపై బాగా పనిచేసింది.

పంజాబ్‌లో ఆప్‌ విజయానికి మరో ప్రధాన కారణం సీఎం అభ్యర్ధి భగవంత్‌ మాన్. ఇతనికి మట్టి మనిషి అనే పేరుంది. పైగా ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. ప్రతి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుస్తున్నప్పటికీ.. భగవంత్‌ మాన్‌ ఆస్తులు మాత్రం ఏడాదికేడాది తరుగుతూ వస్తున్నాయి. ఓవరాల్‌గా భగవంత్‌ మాన్‌కు క్లీన్‌ ఇమేజ్‌ ఉంది. ప్రత్యర్థులు సైతం వేలెత్తి చూపలేని, విమర్శించలేని పొజిషన్‌లో ఉన్న వ్యక్తి కావడంతో ఆప్‌కు బాగా కలిసొచ్చింది.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమం మొదలైందే మాల్వా ప్రాంతంలో. కేంద్రంలోని బీజేపీని పరిగెత్తించింది, మూడు సాగు చట్టాలు వెనక్కి తీసుకునేలా చేసింది ఈ ప్రాంత రైతులే. పైగా మాల్వా రీజియన్‌లో 69 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ భారతీయ కిసాన్‌ యూనియన్ అధ్యక్షుడు జోగీందర్ సింగ్‌కు మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఆప్‌ పార్టీకి జోగీందర్ సింగ్‌ మద్దతు ఉండడం కూడా ఆమ్‌ఆద్మీ విజయానికి కారణమైంది.

Tags

Read MoreRead Less
Next Story