మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు పార్లమెంట్ లో ప్రకంపనలు స్రుష్టించాయి. ఇటు లోక్ సభ, అటు రాజ్యసభలో చర్చ జరిగింది. దీనిపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ రాజ్యసభలో లేవనెత్తారు. ఆయనకు మద్దతుగా బీజేపీ నేతలు తమ సీట్లలోంచి లేచి నినాదాలు చేశారు. మరోవైపు ఎన్సీపీ నేతలు దేశ్ ముఖ్ కు సపోర్ట్ గా నినాదాలు చేయడంతో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో ఛైర్మన్... సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.
అటు అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణల అంశం లోక్ సభలోనూ ప్రస్తావనకు వచ్చింది. 16 ఏళ్లు సస్పెన్షన్ లో ఉన్న సచిన్ వాజేను తిరిగి విధుల్లోకి ఎలా తీసుకున్నారంటూ స్వతంత్ర ఎంపీ నవనీత్ రవిరాణా ప్రశ్నించారు. అటు బీజేపీ ఎంపీలు కూడా మహారాష్ట్ర సర్కారు తీరుపై మండిపడ్డారు.
మరోవైపు అనిల్ దేశ్‌ముఖ్ వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. అంతేకాదు ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని పట్టుబడుతోంది. ఈ వ్యవహారంపై బీజేపీ ప్రతినిధుల బృందం ఈనెల 24న మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని కలవనుంది.
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ ఇంటి ఎదుట పేలుడు పదార్థాల వాహనం దొరకిన తర్వాత చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో పోలీసు అధికారి సచిన్ వాజే అరెస్టయ్యారు. అయితే 16 ఏళ్లు సస్పెన్షన్ లో ఉన్న తర్వాత మళ్లీ విధుల్లోకి ఎందుకు తీసుకున్నారంటూ విపక్షాలు ఉద్దవ్ ఠాక్రేను నిలదీస్తున్నాయి. మరోవైపు అరెస్టైన సచిన్ వాజేకు... హోంమంత్రి వసూళ్ల టార్గెట్లు విధించారని, ప్రతినెలా 100 కోట్లు లక్ష్యంగా పెట్టారని ఇటీవలే బదిలీ అయిన ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ వీర్ సింగ్... సీఎం ఉద్దవ్ ఠాక్రేకు లేఖ రాయడంతో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ వ్యవహారం అటు ఎన్సీపీకి, ఇటు శివసేనకు ఇబ్బందికరంగా మారింది. మహా వికాస్ అఘాడీ కూటమి సమావేశమై ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకోనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com