Maharashtra: రాత్రి ఏడైతే టీవీలు, ఫోన్లు స్విచ్ఛాఫ్.. ఎక్కడ.. ఎందుకు..

Digital Detox: ఊరి బాగుని, పిల్లల భవిష్యత్తుని కోరుకునే సర్పంచ్ ఆయన. అందుకే అందరితో ఓ రోజు మీటింగ్ పెట్టారు. పరిస్థితి ఇలానే ఉంటే భావి భారత పౌరుల గమ్యం అగమ్య గోచరమవుతుందన్నారు. పరిష్కారం చూపించారు. అందరికీ నచ్చడంతో అమలుపరుస్తున్నారు.
రాత్రి 7 గంటలకు స్థానిక దేవాలయం నుండి సైరన్ మోత వినిపిస్తుంది. అంతే ఊరంతా అలెర్ట్ అయిపోతుంది. మహిళలు వంట, గట్రా పనుల్లోకి, పిల్లలు పుస్తకాలు పట్టి చదువులోకి నిమగ్నమవుతారు. రాత్రి 8.30 గంటల వరకు హోంవర్క్స్ చేసుకోవడం, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వంటివి చేస్తారు. ఆ సమయంలో మొబైల్ ఫోన్లు, ఇతర గాడ్జెట్లు, టీవీ సెట్లు మొదలైనవాటిని ఆపివేస్తారు.
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో గత ఆగస్ట్ నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతిరోజూ సాయంత్రం "డిజిటల్ డిటాక్స్" కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు మనిషి విలువైన సమయాన్ని హరించి వేస్తున్నాయని కనీసం రోజుకి ఓ గంటన్నర అన్నా వాటికి దూరంగా ఉండాలని ఊరి సర్పంచ్ నిర్ణయించారు. ఆయన నిర్ణయాన్ని ఊరి ప్రజలు, పిల్లలు శిరసావహిస్తున్నారు.
మోహిత్యంచే వడ్గావ్ గ్రామ సర్పంచ్ విజయ్ మోహితే ఈ ఆలోచనను రూపొందించారు. సర్పంచ్ మోహితే మాట్లాడుతూ.. ఆన్‌లైన్ తరగతులు ముగిసిన తర్వాత కూడా పిల్లలు మొబైల్ ఫోన్‌లలోనే ఎక్కువ గంటలు గడుపుతున్నారు. తల్లిదండ్రులు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఈ పరిస్థితి మారాలని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
ఆన్‌లైన్ తరగతులు ముగిసి పిల్లలు బడికి వెళ్లడం ప్రారంభించారు. కానీ పిల్లలు చదువుపై దృష్టి పెట్టడం లేదు. సోమరిగా మారారు. వారికి చదవడం, వ్రాయడం ఇష్టం ఉండట్లేదని లేదని ఉపాధ్యాయులు కంప్లైంట్ ఇస్తున్నారు. దీంతో తాను 'డిజిటల్ డిటాక్స్' ఆలోచనను ముందుకు తెచ్చినట్లు చెప్పారు.
మొబైల్, టీవీ స్క్రీన్‌లకు దూరంగా ఉండడం సాధ్యమేనా అని మొదట్లో సందేహం వచ్చింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున మహిళా గ్రామసభను ఏర్పాటు చేశాం. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సేవకులు, గ్రామ పంచాయతీ ఉద్యోగులు, రిటైర్డ్ టీచర్లు ఇంటింటికి వెళ్లి డిజిటల్ డిటాక్స్ గురించి అవగాహన కల్పించేందుకు సైరన్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు.
మోహిత్యంచే వడ్గావ్ స్వాతంత్ర్య సమరయోధుల నిలయమని, ఎల్లప్పుడూ అభివృద్ధి పనులపై దృష్టి సారిస్తుందని అన్నారు. ''ప్రస్తుతం రాత్రి 7 గంటల నుంచి 8.30 గంటల మధ్య ప్రజలు తమ మొబైల్ ఫోన్లను పక్కన పెట్టుకుని, టెలివిజన్ సెట్లను స్విచ్ ఆఫ్ చేసి చదవడం, చదవడం, రాయడం, సంభాషణలపై దృష్టి సారిస్తున్నారు. ఈ కార్యక్రమం అమలవుతుందో లేదో పర్యవేక్షించేందుకు వార్డుల వారీగా కమిటీని ఏర్పాటు చేశారు'' అని సర్పంచ్ వివరించారు.
యాదృచ్ఛికంగా, ఈ నెల ప్రారంభంలో మధ్యప్రదేశ్‌లోని రైసెన్‌లో జైన్ కమ్యూనిటీకి చెందిన కొందరు వ్యక్తులు ఇదే పద్ధతిని అవలంభించారు. తమ స్మార్ట్‌ఫోన్‌లకు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లకు 24 గంటల పాటు దూరంగా ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com