పోలీసుల మధ్యే కాల్పులు.. అతిక్ అహ్మద్,అష్రఫ్ అహ్మద్ దారుణ హత్య

యూపీ గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ దారుణ హత్యకు గురయ్యారు. పోలీసు కస్టడీలో ఉన్న వీరిని జైలు నుంచి మెడికల్ చెకప్ కోసం తీసుకెళ్తుండగా ప్రయాగ్ రాజ్ ఆస్పత్రి దగ్గర దుండగులు వారిపై కాల్పులు జరిపారు. జర్నలిస్టుల్లా వచ్చిన ముగ్గురు నిందితులు వారిపై తుపాకులతో అతి దగ్గరి నుంచి కాల్చారు. మొదట అతీక్ కణతపై పెట్టి ఒక వ్యక్తి కాల్పులు జరపగా.. ఆ తర్వాత కింద పడ్డాకా వారిద్దరిపై కాల్పులు కొనసాగాయి. సుమారు 10 రౌండ్లకుపై నిందితులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఒక పోలీసుకూ గాయాలయ్యాయి. బుల్లెట్ గాయాలతో ఉన్న అతిక్, అష్రాఫ్ మృతదేహాలను పోలీసులు సంఘటనాస్థలి నుంచి తరలించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కాల్పుల ఘటనపై ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ముగ్గురు సభ్యులతో జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. పోలీసుల సమక్షంలోనే కాల్పులు జరగడాన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందని సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు.
గతంలో జరిగిన ఉమేశ్‌పాల్ కిడ్నాప్ కేసు విచారణలో భాగంగా వారిద్దరినీ కోర్టుకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి వైద్య పరీక్షలకు తరలిస్తుండగా కాల్పులు జరిగాయి. అతీక్‌పై దాదాపు 100 క్రిమినల్ కేసులున్నాయి. మరోవైపు యూపీలో సంచలనం సృష్టించిన ఉమేశ్ పాల్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్‌ను పోలీసులు గురువారం ఎన్‌కౌంటర్ చేశారు. అతడితో పాటు మరో నిందితుడు గుల్హామ్‌ను కూడా కాల్చి చంపారు. ఝాన్సీలో రాష్ట్ర స్పెషల్ టాస్క్ ఫోర్స్ జరిపిన ఎన్‌కౌంటర్‌లో వీరిద్దరు హతమయ్యారు. ఘటనాస్థలంలో అధునాతన విదేశీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఉమేశ్ పాల్ హత్య కేసులో విచారణ నిమిత్తం అతీక్ అహ్మద్‌ను ప్రయాగ్‌రాజ్ కోర్టులో హాజరుపర్చారు. అదే సమయంలో ఈ ఎన్‌కౌంటర్ చేసుకోగా.. తాజాగా అతీక్ ఆహ్మద్ హత్యకు గురవ్వడం సంచలనం రేపుతుంది.
మాజీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్యకేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేశ్ పాల్ ఫిబ్రవరి 24న దారుణ హత్యకు గురయ్యారు. ఆయనతో పాటు ఇద్దరు బాడీ గార్డ్‌లను కూడా హంతకులు పట్టపగలే కాల్చి చంపడం యూపీలో సంచలనం సృష్టించింది. ఉమేశ్ భార్య జయ పాల్ ఫిర్యాదు మేరకు ఈ ఘటనలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ , అతడి సోదరుడు అష్రఫ్, ఇద్దరు కుమారులు, ఇద్దరు అనుచరులు, మరో తొమ్మది మందిపై కేసులు నమోదు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com