పంజా విసురుతున్న బర్డ్ ఫ్లూ .. వైరస్ దెబ్బకు ప్రాణాలు కోల్పోతున్న పక్షులు

పంజా విసురుతున్న బర్డ్ ఫ్లూ  .. వైరస్ దెబ్బకు ప్రాణాలు కోల్పోతున్న పక్షులు
బర్డ్ ఫ్లూ పంజా విసురుతోంది. వైరస్ దెబ్బకు పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ వైరస్ మనుషులకు కూడా సోకుతుందనే భయం పట్టుకుంది.

బర్డ్ ఫ్లూ పంజా విసురుతోంది. వైరస్ దెబ్బకు పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ వైరస్ మనుషులకు కూడా సోకుతుందనే భయం పట్టుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదంది. అయితే గుడ్లు, మాంసం బాగా ఉడికించి తినాలని కేంద్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ దేశ ప్రజలకు సూచించారు.

మరోవైపు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ప్రస్తుత పరిస్థితిపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్ని రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. బర్డ్ ఫ్లూ పరిస్థితిని సమీక్షించి, ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూంను కూడా ఏర్పాటు చేసింది.

రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్‌లలో బర్డ్‌ ఫ్లూ వల్ల భారీ సంఖ్యలో పక్షులు మృత్యువాత పడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో వైరస్ కేసులు పెరుగుతుండడంతో జమ్మూకశ్మీర్ అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. ఇక హర్యానాలోని పంచకుల జిల్లాలో గత పది రోజుల్లో 4 లక్షలకుపైగా కోళ్లు మరణించాయి. అయితే వాటిలో బర్డ్‌ ఫ్లూ వైరస్ నిర్ధారణ కాలేదని అధికారులు అంటున్నారు. కానీ కోళ్ల మరణానికి కారణమేంటో మాత్రం వెల్లడించలేదు.

కేరళలోని అలప్పుజ, కొట్టాయం జిల్లాల్లో దాదాపు 1700 బాతులు అనుమానాస్పద స్థితిలో మరణించాయి. అప్రమత్తమైన అధికార యంత్రాంగం... వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు చేపట్టింది. కోళ్లు, బాతులను చంపే ప్రక్రియ చేపట్టారు. 40 వేలకుపైగా కోళ్లు, బాతులను వధించక తప్పదని అధికారులు వెల్లడించారు.

Tags

Next Story