BRS : మహారాష్ట్ర గడ్డపై సీఎం కేసీఆర్ సమరశంఖం

మహారాష్ట్ర గడ్డపై బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించారు. దేశంలో మార్పు కోసమే జాతీయ పార్టీగా బీఆర్ఎస్ అవతరించిందన్నారు. నాందేడ్ బీఆర్ఎస్ సభలో మోదీ సర్కారుపై మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధానులు.. పార్టీలు మారినా దేశం పరిస్థితి మారలేదని ఆరోపించారు. ప్రస్తుత నేతలు మాటలకే పరిమితం అవుతున్నారని పరోక్షంగా మోదీని టార్గెట్ చేశారు. భారత్‌లో సమూల మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. దేశ నాయకత్వంలో మార్పు వచ్చినపుడే ప్రగతి సాధ్యమని స్పష్టంచేశారు. దేశంలో మార్పు తీసుకురావడానికి జాతీయ రాజకీయాల్లోకి వచ్చిన తనను మహారాష్ట్ర, నాందేడ్ ప్రజలు ఆదరించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
నాందేడ్ సభలో కేసీఆర్ సమక్షంలో భారీగా బీఆర్ఎస్‌లో చేరారు మహారాష్ట్ర నేతలు. బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న నాయకులకు కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో గురుద్వార సందర్శించి ప్రార్థనలు చేశారు. కేసీఆర్‌కు స్థానిక బీఆర్ఎస్ నేతలు ఘనస్వాగతం పలుకగా.. పార్టీ జెండాలు, స్వాగత తోరణాలతో నాందేడ్ గులాబీమయంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com