Current Charges : కరెంట్ ఛార్జీలు పెంచే దిశగా కేంద్రం అడుగులు..!

Current Charges : దేశంలో ఇంధన ధరలు, నిత్యవసర ధరల పెంపుతో ప్రజలపై పెనుభారం పెడుతోంది. ఇదిచాలదనంటూ కేంద్రం కరెంట్ ఛార్జీలను పెంచే దిశగా అడుగులు వేస్తోంది. ఇబ్బడి ముబ్బడిగా పెంచేందుకు మరుగునపడిన ఇంధన సర్దుబాటు ఛార్జీలను మళ్లీ తెరపైకి తెచ్చి జనానికి వాత పెట్టాలని చూస్తోంది. విద్యుదుత్పత్తికి వినియోగించే బొగ్గు, గ్యాస్ ధరలు పెరగడం వల్ల పడుతున్న భారాన్ని ఎప్పటికప్పుడు వినియోగదారుల నుంచే వసూలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది.
ఇంధన సర్దుబాటు ఛార్జీల రూపంలోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మార్పులు చేస్తున్నట్లుగా ఇకపై కరెంట్ బిల్లు కూడా ప్రతిసారి మార్చాలని నిర్ణయించింది. అదే నిర్ణయాన్ని అమలు చేయాలని రాష్ట్రాలు, ఈఆర్సీలను ఆదేశించింది. గత నెల 22న విద్యుత్ నిబంధనలు-2021ను ప్రకటించింది కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ. ధరలు పెంచే విషయంపై రాష్ట్రాల ఈఆర్సీలు సొంత ఫార్ములా రూపొందించే వరకు కేంద్ర ఫార్ములాను అనుసరించాలంటోంది.
బొగ్గు కొనుగోళ్ల విషయంలో పవర్ ప్రాజెక్టులకు అవసరమైన డబ్బులు సకాలంలో అందకపోవడంతో విద్యుత్ సంక్షోభం ఏర్పడుతోంది. ఈ సమస్యతో పాటు విద్యుత్ సరఫరా సేవల నాణ్యత కూడా దెబ్బతింటోంది. ఈ సమస్యల్ని అధిగమించేందుకే పెరిగే బొగ్గు, గ్యాస్ ధరల వ్యయ భారాన్ని విద్యుదుత్పత్తి కంపెనీలు సకాలంలో డిస్కంల నుంచి, డిస్కంలు వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవడానికి వీలు కల్పిస్తూ ఈ కొత్త రూల్‌ని పాస్ చేసింది కేంద్రం.
ప్రస్తుతం విద్యుత్ ఛార్జీలను ఏడాదికి ఒకసారి సవరించుకునే పద్దతి ఉంది. కానీ ఇంధన సర్దుబాటు చార్జీల ఫార్ములా ఆధారంగా టారిఫ్‌ను ఏడాదిలో ఒకసారికి మించి సవరించుకోవడానికి విద్యుత్ చట్టంలోని సెక్షన్ 62(4) అనుమతిస్తోంది. దీని ఆధారంగానే ఇకపై కరెంట్ ఛార్జీలను ప్రతినెల పెంచుకునేలా ప్రణాళికను రూపొందించింది కేంద్రం. ఆరేళ్ల క్రితం దీన్ని అమలు చేస్తే జనం గగ్గోలు పెట్టడంతో కోర్టు జోక్యంతో బ్రేక్ పడింది. ఇన్నాళ్ల తర్వాత కేంద్రం మరోసారి FSAను తెరపైకి తెచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com