కరోనా కేసులు తగ్గడం.. వ్యాక్సినేషన్‌ సక్సెస్‌తో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయాలు

కరోనా కేసులు తగ్గడం.. వ్యాక్సినేషన్‌ సక్సెస్‌తో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయాలు
ఈ మూడు కార్యకలాపాలకు సంబంధించిన నిబంధనలను త్వరలో విడుదల చేస్తామని కేంద్రం తెలిపింది.

దేశంలో కరోనా కేసులు తగ్గడం... మరోవైపు వ్యాక్సినేషన్‌ కూడా సక్సెస్‌ కావడంతో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇన్నాళ్లు ఆంక్షలతో సతమతమైన ప్రజలను ఉత్తేజపరిచేలా చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగానే ఆంక్షలను మరింత సడలించేందుకు సిద్ధమైంది. సినిమా హాళ్లు, ఇతర థియేటర్లలో ప్రస్తుతం అనుమతిచ్చిన 50 శాతం సీటింగ్‌ సామర్థ్యాన్ని మరింత పెంచుకునేందుకు అనుమతివ్వనున్నట్లు కొత్త మార్గదర్శకాల్లో కేంద్ర హోంశాఖ తెలిపింది. అలాగే ఇప్పటివరకు క్రీడాకారులకు మాత్రమే అనుమతి ఉన్న ఈత కొలనుల్లో... అందరినీ అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఇక కేవలం బిజినెస్‌ టు బిజినెస్‌ ఎగ్జిబిషన్ల వరకే ఉన్న అనుమతులను అన్ని రకాల ఎగ్జిబిషన్ హాళ్లకూ విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మూడు కార్యకలాపాలకు సంబంధించిన నిబంధనలను త్వరలో విడుదల చేస్తామని కేంద్రం తెలిపింది.

మరోవైపు కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రకృతి వైపరీత్య నిర్వహణ చట్టం కింద జారీ చేసిన మార్గదర్శకాల కాల పరిమితి.. ఈ నెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు అమలు చేసే కొత్త నిబంధనలను జారీ చేసింది. కంటైన్మెంట్‌ జోన్ల బయట అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఇక కొత్త నిబంధనలు చూస్తే..థియేటర్లు, ఫంక్షన్‌ హాళ్లు, క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు 200 మందిని అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే బహిరంగ ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలకైతే..ఆ మైదానం వైశాల్యం బట్టి జనాభా పాల్గొనేందుకు అనుమతిచ్చింది. ఇప్పుడు ఇలాంటి చోట్ల ఎంతమందికి అనుమతివ్వాలనే స్వేచ్ఛను రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలిపెట్టింది.

అలాగే అంతర్జాతీయ విమాన సేవల ప్రారంభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ.. హోంశాఖతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటుందని కేంద్రం స్పష్టం చేసింది. రైళ్లు, విమానాలు, మెట్రోరైళ్లలో ప్రయాణికుల రాకపోకలు, పాఠశాలలు, పార్కులు, జిమ్‌లకు సంబంధించిన ఎస్‌ఓపీలను ఎప్పటికప్పుడు నవీకరించనున్నట్లు తెలిపింది. ఇక రాష్ట్రాల మధ్య కానీ, ఒకే రాష్ట్రంలో ఒకచోట నుంచి మరోచోటికి వెళ్లడంపై కానీ, ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా సరిహద్దుల మధ్య జరిగే వాణిజ్యంపై ఆంక్షలు విధించకూడదని పేర్కొంది. కొవిడ్‌ను దృష్ట్య ప్రజలు మాస్కుల వినియోగం, శానిటైజర్లు, భౌతిక దూరం పాటించేలా రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలి.

Tags

Read MoreRead Less
Next Story