కరోనా కట్టడిలో టీకాలపై కేంద్రం కీలక ప్రకటన

Covid Vaccine Representional Image
Covid 19 Vaccine: దేశంలో మరో నాలుగు వ్యాక్సిన్లు మానవులపై ప్రయోగ దశల్లో ఉన్నాయని మోదీ ప్రభుత్వం వెల్లడించింది. అలాగే, జెనిక్ లైఫ్ సైన్సెస్ అభివృద్ధి చేస్తున్న టీకా మాత్రం అడ్వాన్స్డ్ దశలో ఉందని పేర్కొంది కరోనా కట్టడిలో కీలక అస్త్రాలైన టీకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో కీలక ప్రకటన చేసింది. దేశంలో ఇప్పటికే మూడురకాల టీకాల పంపిణీ కొనసాగుతుండగా.. మరో నాలుగు వ్యాక్సిన్లు మానవులపై ప్రయోగాల్లో వేర్వేరు దశల్లో ఉన్నాయని, అలాగే, జెనిక్ లైఫ్ సైన్సెస్ అభివృద్ధి చేస్తున్న టీకా మాత్రం అడ్వాన్స్డ్ దశలో ఉందని కేంద్ర వెల్లడించింది. ఈ మేరకు సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాలను పేర్కొన్నారు.
క్యాడిలా హెల్త్ కేర్ లిమిటెడ్ డీఎన్‌ఏ ఆధారిత వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉందన్నారు. అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ మధ్యంతర డేటాను సమర్పించిందన్నారు. ఇకపోతే, బయోలాజికల్-ఈ లిమిటెడ్ తయారు చేస్తున్న టీకాతో పాటు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తున్న ఎడెనో ఇంట్రానాసల్ వ్యాక్సిన్ కూడా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాయని మంత్రి స్పష్టంచేశారు. అలాగే, జెన్నోవా బయో ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ ఎం-ఆర్‌ఎన్‌ఏ టీకా మొదటి దశ ట్రయల్స్‌లో ఉందని పేర్కొన్నారు.
గుడ్‌గావ్‌కు చెందిన జెనిక్ లైఫ్ సైన్సెస్ ప్రైవేటు లిమిటెడ్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ మాత్రం అడ్వాన్స్డ్ ప్రీ క్లినికల్ దశలో ఉందని జితేంద్ర సింగ్ వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం భారత్ బయోటెక్ సంస్థ తయారుచేసిన కొవాగ్జిన్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పంపిణీ చేస్తున్న కొవిషీల్డ్‌తో పాటు రష్యాకు చెందిన స్పుత్నిక్ వి టీకాలు వినియోగంలో ఉన్న విషయం తెలిసిందే. కొత్త వ్యాక్సిన్లు వస్తే దేశంలో మరింతగా టీకా లభ్యత అవకాశాలు పెరగనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com