Bipin Rawat : భారత్‌కు చైనా అతిపెద్ద భద్రతా ముప్పు..!

భారత్‌కు చైనా అతిపెద్ద భద్రతా ముప్పుగా మారిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్. దేశ సరిహద్దులను కాపాడుకునేందుకు గత ఏడాది తరలించిన సైన్యం, ఆయుధ సామగ్రి ఇప్పట్లో తిరిగి రాలేని పరిస్థితి నెలకొందన్నారాయన. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాద పరిష్కారం విషయంలో విశ్వాస లోపం, అనుమానాలే అడ్డుపడుతున్నాయని వెల్లడించారు. ఇదే విషయమై గత నెలలో ఇరు దేశాల మిలిటరీ కమాండర్ల మధ్య జరిగిన 13వ రౌండ్ చర్చలు ఎటూ తేలకుండానే ముగిశాయి.
గతేడాది గల్వాన్ లోయలో ఘర్షణలు మొదలు.. ఇరు దేశాలు సరిహద్దుల వెంబడి మౌలిక సదుపాయాల కల్పన, బలగాల మోహరింపు చేపడుతున్నట్లు జనరల్ రావత్ చెప్పారు. మరోవైపు ఎలాంటి విపత్కర పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. దేశ సరిహద్దుల్లో భద్రతను పటిష్ఠం చేసినప్పటికీ, ఒకవేళ అఫ్గాన్‌లో ఉగ్రశక్తులు మళ్లీ విజృంభిస్తే.. జమ్మూ-కశ్మీర్‌లోని ఉగ్రబృందాలకు ఊతం లభించే అవకాశం ఉందన్నారు. ఇటు చైనాతో.. అటు పాక్, తాలిబన్లతో భద్రతాపర సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నందున.. రెండు వైపులా సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com