'కర్తవ్యం' సినిమా చూసి నాన్న.. ఎస్సై శిరీషను అభినందించిన విజయశాంతి

నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి ఎస్సై శిరీషను అభినందించారు. మానవత్వంతో ఆమె స్పందించిన తీరును ప్రశంసించారు. విధుల్లో భాగంగా ఓ అనాథ శవాన్ని భుజాల మీద మోసుకుంటూ వెళ్లిన శిరీషను ప్రశంసిస్తూ ఫేస్‌బుక్ వేదికగా అభినందనలు తెలియజేశారు.
ఆడపిల్ల.. సమాజంలో ఇంకా వివక్షకు గురవుతూనే ఉంది.. కానీ కొందరు తల్లిదండ్రుల పుణ్యఫలంతో ఆమె ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతోంది. తండ్రిని తలెత్తుకునేలా చేస్తోంది. ఆడపిల్ల అంటే ఆడపిల్లే కాని ఈడపిల్ల కాదనే ఆలోచనలకు తిలోదకాలిచ్చి.. అవసరమైతే అపరకాళి అవతారమెత్తుతోంది. అన్యాయాన్ని సహించబోమంటూ గొంతెత్తి చాటుతోంది.
అదే సమయంలో తనలో సహజంగా ఉండే సౌకుమార్యాన్ని ప్రదర్శిస్తోంది. మానవత్వంతో ప్రజ్వరిల్లుతోంది. కొడుకులతో సమానంగా పెంచుతూ సమాజంలో కూతురి పాత్రకు ఉన్న ప్రాధాన్యతను వివరిస్తున్నారు నేటి తల్లిదండ్రులు. మొన్నటికి మొన్న చిత్తూరు జిల్లా డీఎస్పీ జెస్సీ ప్రశాంతికి సీఐగా విధులు నిర్వహిస్తున్న తండ్రి శ్యాంసుందర్ సెల్యూట్ చేయడం అభినందనీయం.
తాజాగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న కొత్తూరు శిరీష ఓ అనాథ శవాన్ని భుజాల మీద మోసుకుంటూ వెళ్లి మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి అతడి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కర్తవ్యం సినిమాను చూసి దాన్ని ప్రేరణగా తీసుకుని నా కూతురిని పోలీస్ ఆఫీసర్‌ని చేశానని తండ్రి గర్వంగా చెప్పుకున్నారు ఓ ఇంటర్వ్యూలో. తండ్రి ఆశయాలకు, ఆకాంక్షలకు బాసటగా నిలిచిన శిరీష అవసరమైన చోట లాఠీకీ పని చెప్పగలరు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్న శిరీష తన పోస్ట్‌కి వంద శాతం న్యాయం చేస్తుంటారు.
అదే విషయాన్ని విజయశాంతి ప్రస్తావిస్తూ.. నేను నటించిన కర్తవ్యం సినిమా ఒక తండ్రికి ప్రేరణనిచ్చి, తన కూతురిని సమాజం మెచ్చే పోలీస్ అధికారిణిగా తీర్చిదిద్దడం నాకెంతో ఆనందం కలిగించింది. ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని విధి నిర్వహణలో ముందుకు సాగుతున్న కాశీబుగ్గ ఎస్‌ఐ కొత్తూరు శిరీషకు అభినందనలు అని పోస్ట్ చేశారు.
https://www.facebook.com/VijayashanthiOfficial/posts/1308207789545915
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com