దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి మరోసారి పంజావిసిరింది. ప్రాణాంతక వైరస్ ర్యాపిడ్ స్పీడ్‌తో విజృంభిస్తోంది. దీంతో దేశంలో కొత్తగా లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులో లక్ష కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఈ తీవ్రత అన్నింటికంటే ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఆంక్షలు, కర్ఫ్యూ కొనసాగుతోంది. కర్నాటకలోనూ కేసుల తీవ్రత పెరుగుతుండడంతో కొన్ని నిబంధనలు కఠినతరం చేశారు.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1లక్షా 3వేల 558 మంది కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1 కోటి 25 లక్షల 89వేల 67కు చేరింది. కొత్తగా 478 మంది మరణించారు. ఇప్పటివరకు 1కోటి 16 లక్షల 82వేల 136 మంది మహమ్మారి బారినుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 1 లక్ష 65 వేల 101 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 7లక్షల 41వేల 830 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఒక్కరోజులో 52వేల 847 మంది వైరస్‌నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో ఇప్పటివరకు 7కోట్ల 91లక్షల 5వేల 163 మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశామని కేంద్రం తెలిపింది.
కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ తరహా కఠిన ఆంక్షలు విధించింది. ఇవాళ్టి నుంచి రాష్ట్రమంతటా నైట్ కర్ఫ్యూ అమలు చేసింది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. వారాంతరాల్లోనూ పూర్తి లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నారు. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ఇది అమలులో ఉంటుంది. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తారు. పగటి పూట ఐదుగురు మించి గుమిగూడి ఉండకూడదని.. థియేటర్లు, పార్కులు, హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు మూసివేయాలని నిర్ణయించారు. కేవలం టేక్‌అవే, ఫుడ్, నిత్యవసరాల డెలివరీకి మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రజా రవాణా వ్యవస్థలైన బస్సులు, రైళ్లు 50 శాతం సామర్థ్యంతో నడుస్తాయి. సినిమా షూటింగ్‌లను పరిమిత సంఖ్యలో అనుమతిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com