Corona: జులై నెలాఖరుకు కరోనా..: ఎస్ఆర్ఎం యూనివర్శిటీ అధ్యయనం

Corona: గత వారం రోజులుగా తగ్గుతున్న పాజిటివిటీ రేటుతో దేశ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో శుభవార్త అందించింది ఎస్ఆర్ఎం యూనివర్శిటీ. దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో జులై నెలాఖరుకు కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీ అధ్యయనం తెలిపింది.
ఎనిమిది రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ ఎప్పటికి తగ్గుతుందన్న అంశంపై యూనివర్శిటీ ప్రొ వైస్ ఛాన్సలర్ డి. నారాయణరావు పర్యవేక్షనలోని బృందం అధ్యయనం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉన్న ఎస్ఐఆర్ (సస్పెక్టబుల్, ఇన్ఫెక్టెడ్, రికవరీ) మోడల్ సాయంతో ర్యాండమ్ ఫారెస్ట్ మెషీన్ లెర్నింగ్ అల్గరిథమ్ డేటాను తమ బృందం తయారు చేసిందని, అది వైరస్ వ్యాప్తి, వేగం, తీవ్రతతో పాటు రికవరీని అంచనా వేస్తుందని ఆయన వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, దిల్లి, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్ లో రోజువారీ కేసుల వివరాల్ని తీసుకుని, ఎస్ఐఆర్ విధానంలో ఎప్పటికి తగ్గుతుందో అంచనా వేసినట్టు తెలిపారు. ఉత్తర ప్రదేశ్, దిల్లీల్లో తమ అంచనాలకు రెండు మూడు రోజులు అటూ ఇటుగా కోవిడ్ తగ్గుముఖం పట్టిందని ఆయన వెల్లడించారు.
ఈ అధ్యయనం ప్రకారం..
కర్ణాటకలో జులై మొదటి వారంలో..
మహారాష్ట్రలో జులై రెండవ వారంలో..
ఆంధ్రప్రదేశ్ లో జులై మూడవ లేదా నాలుగో వారంలో..
తమిళనాడులో జులై నెలాఖరుకు
కేరళలో అయితే ఆగస్టు రెండో వారంలో,
పశ్చిమ బెంగాల్ లో సెప్టెంబర్ మొదటి వారంలో కరోనా ఉద్ధృతి తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు.
అయితే భారీ జన సమీకరణ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లైతే కోవిడ్ తగ్గడంలో కొంత జాప్యం జరుగుతుందని నారాయణరావు పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com