ప్రస్తుత వైరస్‌ది మూడో రూపం అంటున్న శాస్త్రవేత్తలు

ప్రస్తుత వైరస్‌ది మూడో రూపం అంటున్న శాస్త్రవేత్తలు
X
లక్షన్నర నమూనాలను విశ్లేషించిన సైంటిస్టులు.. డబుల్‌ మ్యుటెంట్ వైరస్‌ వల్లే ఈ కల్లోలం జరుగుతోందని ఓ నిర్దారణకు వచ్చారు.

కరోనా వైరస్ ఒక్కసారిగా విరుచుకుపడడానికి కారణం ఏంటి? కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా పెరగడానికి రీజన్ ఏంటి? డబుల్ మ్యుటెంట్‌ వైరస్‌ దాడే ఇందుకు కారణమా? లక్షన్నర నమూనాలను విశ్లేషించిన సైంటిస్టులు.. డబుల్‌ మ్యుటెంట్ వైరస్‌ వల్లే ఈ కల్లోలం జరుగుతోందని ఓ నిర్దారణకు వచ్చారు. అంటే మొదట పుట్టుకొచ్చిన వైరస్.. తనలో తాను కొన్ని మార్పులు చేసుకుంది. ఇప్పుడు మరోసారి తన రూపం, గుణాలు మార్చుకుంది.

అదే డబుల్‌ మ్యుటెంట్ వైరస్‌ అని అంటున్నారు శాస్త్రవేత్తలు. వైరస్‌ విజృంభిస్తున్న పది రాష్ట్రాల నుంచి లక్షా 40వేల నమూనాలను పరీక్షించిన సైంటిస్టులు.. ఈ నిర్ధారణకు వచ్చారు. మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌, కర్నాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ డబుల్‌ మ్యుటెంట్‌ వైరస్‌ ఉన్నట్టు గుర్తించారు. దాని వల్లే ఈ పది రాష్ట్రాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిందని అభిప్రాయపడుతున్నారు.

కరోనా వైరస్‌కు మూడో రూపమే డబుల్ మ్యుటెంట్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ పదిరాష్ట్రాల్లో కనిపిస్తున్న డబుల్‌ మ్యుటెంట్‌ వైరస్‌లో L‌452R అనే వేరియంట్‌ ఉంది. దీని మూలం అమెరికాలోని కాలిఫోర్నియా. E484Q వేరియంట్‌ను మనదేశంలో గుర్తించారు.

ఈ రెండు వేరియెంట్లు కలగలిపి పుట్టుకొచ్చిన వైరస్సే డబుల్ మ్యుటెంట్. దేశంలో కరోనా మరణాలు పెరగడానికి ఈ డబుల్‌ మ్యుటెంట్‌ వైరస్ కారణమా కాదా అనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. కరోనా మరణాలతో పాటు వైరస్ తీవ్రత, పాక్షిక ప్రభావం, రీ-ఇన్‌ఫెక్షన్, వ్యాక్సిన్ సమర్ధతపై డబుల్ మ్యుటేషన్ ఎలాంటి ప్రభావం చూపుతోంది అనే దానిపై విశ్లేషిస్తున్నారు.

ఢిల్లీలో బయటపడుతున్న కరోనా కేసులలో యూకే స్ట్రెయిన్ కూడా కనిపిస్తోంది. పంజాబ్‌లోని కరోనా కేసులలో 80 శాతం మందిలో బ్రిటన్ స్ట్రెయిన్, మహారాష్ట్రలో 61 శాతం శాంపిళ్లలో డబుల్‌ మ్యుటేషన్‌ బయటపడినట్లు నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లోని 80 జిల్లాల్లో యూకే స్ట్రెయిన్ కేసులు ఉన్నట్టు గుర్తించారు. ఇక దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లు దేశంలోని కొన్ని జిల్లాల్లో స్వల్ప స్థాయిలో ఉన్నట్టు తెలిపారు.

వైరస్ తన రూపు మార్చుకున్నంత మాత్రాన మరణాల సంఖ్య పెరుగుతుందన్న గ్యారెంటీ లేదంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌. కాని, కొత్త వైరస్ మ్యుటేషన్లు బ్రెజిల్‌లో ప్రమాదకరంగా మారాయన్న వార్తలు వస్తున్నాయి. యాంటీబాడీలు ఏర్పడినప్పటికీ.. కొత్త వైరస్‌ సమర్ధంగానే ఎదుర్కొంటోందని చెబుతున్నారు. బ్రెజిల్‌లో కరోనా కేసుల వ్యాప్తికి కారణమైన P1 వేరియంట్

బ్రెజిల్‌ వేరియంట్‌ వ్యాక్సిన్ల ప్రభావాన్ని కూడా తట్టుకునేలా రూపాంతరం చెందుతోంది. ఇప్పుడు తయారైన వ్యాక్సిన్లు కరనో వైరస్‌లోని స్పైక్ ప్రోటీన్లనే లక్ష్యంగా చేసుకుంటాయి.

కాని, ఈ స్పైక్ ప్రోటీన్లను కూడా వైరస్ మార్చుకుంటూ, వ్యాధి నిరోధకతకు, వ్యాక్సిన్లకు లొంగకుండా బలంగా తయారవుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యాంటీబాడీలకు చిక్కకుండా ఉండేందుకు వైరస్ తనను తాను మార్చుకుంటోందని, వైరస్ దాని పరిణామ క్రమాన్ని వేగంగా మార్చుకోవడం ఆందోళనకరమైన విషయమని హెచ్చరిస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్ హెల్త్ జాయింట్ డైరెక్టర్ సుభాష్ పాండే కరోనా వైరస్‌తో మృతి చెందారు. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. సో, వ్యాక్సిన్ వేయించుకున్నంత మాత్రాన సరిపోదు. మాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరం తప్పనిసరి అని సూచిస్తున్నారు.

Tags

Next Story