దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా విజృంభణ

దేశంలో కరోనా వైరస్ విజృంభణ మళ్లీ ప్రారంభమైంది. కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా మళ్లీ విజృంభిచడం ఆందోళనకు గురిచేస్తోంది. అయితే కరోనా కేసులు ఆరు రాష్ట్రాల్లోనే మాత్రమే ఎక్కువగా నమోదవుతున్నాయి. వీటిలో కేరళ ముందంజలో ఉంది. ప్రస్తుతం రోజువారీ కేసుల్లో కేరళలోనే అత్యధికంగా నమోదు అవుతున్నాయి. ఇక రోజువారీ మరణాలు మాత్రం దేశ రాజధాని దిల్లీలో ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి.
దాదాపు 65శాతం కరోనా కేసులు ఆరు రాష్ట్రాల్లోనే నమోదుఅవుతుండగా.. 61 శాతం మరణాలు కూడా ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. పంజాబ్‌లో కరోనా మరణాల రేటు 3.16శాతం, మహారాష్ట్రలో 2.60శాతం, పశ్చిమ బెంగాల్‌లో 1.75శాతం, దిల్లీలో 1.60శాతంగా ఉంది. ఈ రాష్ట్రాల్లో కరోనా మరణాల రేటు జాతీయ సగటు 1.46శాతం కంటే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
మరోవైపు దేశ రాజధాని దిల్లీలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. నవంబర్ నెలలోనే అక్కడ 2వేల మందికి పైగా మృత్యువాతపడ్డారు. అక్టోబర్ 28 నుంచి ఇప్పటివరకు 2364 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. చలికాలానికి తోడు పండుగ సీజన్ కావడంతో అక్టోబర్ చివరి వారం నుంచి దిల్లీలో కేసులు పెరుగుతున్నాయి.
నవంబర్ 19న 98 మరణాలు నమోదు కాగా.. 20న 118, 21న 111, 22న, 23 తేదీల్లో 121 చొప్పున, నవంబర్ 24న 109చొప్పున మరణాలు నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు.నవంబర్ 18న అత్యధికంగా 131 మరణాలు నమోదు అయ్యాయి. దిల్లీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌కేసుల సంఖ్య 5,45,787కు చేరుకుంది. వీరిలో 8720మంది ప్రాణాలు కోల్పోగా.. 4,98,780 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 38,287 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
నవంబర్ నెలలో 2వేలకు పైగా మరణాలు నమోదవడంపై దిల్లీ హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత ప్రభుత్వం ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షల సంఖ్యను పెంచిందని ఆగ్రహం వ్యక్తంచేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com