ఇండియాను రెండో స్థానంలో నిలబెట్టిన కరోనా సెకండ్ వేవ్..!
కరోనా సెకండ్ వేవ్.. ఇండియాను రెండో స్థానంలో నిలబెట్టింది. ప్రపంచ దేశాల్లో కరోనా విజృంభిస్తున్నా సరే.. మొదట్లో భారత్‌లో అంత ప్రభావం కనిపించలేదు. కాని, సెకండ్ వేవ్‌లో మాత్రం దంచికొడుతోంది. వేలం పాట పాడినట్టు... 50వేలు, లక్ష, లక్షన్నర అంటూ లెక్క పెంచుకుంటూ పోతూనే ఉంది. త్వరలోనే రోజుకు రెండు లక్షల కరోనా కేసులు నమోదైనా ఆశ్చర్యం లేదేమో. ఈ స్థాయిలో వైరస్ విజృంభిస్తోంది కాబట్టే బ్రెజిల్‌ను సైతం వెనక్కు నెట్టి రెండో స్థానంలో ఉంది భారత్. బ్రెజిల్‌లో కోటి 34 లక్షల మందికి కరోనా సోకింది. భారత్ ఆ లెక్కను అధిగమిస్తూ కోటీ 35 లక్షల కేసులతో సెకండ్ ప్లేస్‌లో ఉంది. అమెరికా ఎవరికీ అందనంత దూరంలో మొదటిస్థానంలో ఉంది. యూఎస్‌లో 3కోట్ల 12 లక్షల మందికి వైరస్ సోకింది.
కరోనా మరణాల సంఖ్యలో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉంది భారత్. ఇందులోనూ అగ్రరాజ్యం అమెరికాదే ఫస్ట్ ప్లేస్. అమెరికాలో ఐదు లక్షల 75వేల మంది కరోనాతో చనిపోయారు. బ్రెజిల్‌లో మూడున్నర లక్షలు, మెక్సికోలో రెండు లక్షల మంది చనిపోయారు. ఆ తరువాత స్థానంలో ఉన్న భారత్‌లో.. ఇప్పటి వరకు లక్షా 70వేల మంది కరోనా కారణంగా బలయ్యారు. పైగా భారత్‌లో కరోనా రికవరీ రేటు దారుణంగా పడిపోతోంది. అప్రమత్తంగా లేకపోతే మెక్సికోను అతి త్వరలోనే క్రాస్ చేసి మూడో స్థానంలో కూర్చోవడం ఖాయం అంటున్నారు సైంటిస్టులు. మిగతా దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా, సమర్ధంగా సాగుతుండడంతో కరోనా కేసులు, మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కాని, భారత్‌లో మాత్రం అందుకు విరుద్ధ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యాక్సినేషన్ మొదలైన తరువాత నుంచి దేశంలో సెకండ్ వేవ్ మొదలైంది.
గత 15 రోజులుగా కరోనా ఉధృతి చాలా దారుణంగా ఉంది. జస్ట్ పది రోజుల్లోనే కరోనా కేసులు రెట్టింపు అయ్యాయి. అందునా దేశంలోని పది రాష్ట్రాల్లోనే 83 శాతం కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, కర్నాటక, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాల్లో కరోనా జడలు విప్పుతోంది. మహారాష్ట్రలోనే అత్యధికంగా రోజుకు 60వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో రోజుకు 15వేలు, ఢిల్లీలో 10వేల కేసుల చొప్పున నమోదవుతున్నాయి. మిగతా రాష్ట్రాల్లో పదివేల కంటే తక్కువ ఉన్నాయి.
కరోనా కట్టలు తెంచుకోవడంతో లాక్‌డౌనే శరణ్యం అంటున్నాయి రాష్ట్రాలు. మహారాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌పై రేపు నిర్ణయం తీసుకోనుంది. కనీసం 15 రోజుల పాటు లాక్‌డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ వారం రోజుల్లో కరోనా అదుపులోకి రాకపోతే గనక లాక్‌డౌన్ తప్పదని కర్నాటక సీఎం యడియూరప్ప కూడా చెప్పుకొచ్చారు. ఢిల్లీలోనూ పరిస్థితి అదుపు తప్పుతుండడంతో లాక్‌డౌన్ విధించే యోచనలో ఉన్నట్లు సీఎం కేజ్రీవాల్ కూడా హెచ్చరించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com