ఢిల్లీ వాసులకు కరోనా థర్డ్ వేవ్ ముప్పు

దేశ రాజధాని ఢిల్లీ వాసులకు కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంది. అయితే కేసులు మాత్రం తగ్గుతాయని అధికారులు చెప్పడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఢిల్లీలో చలి తీవ్రత పెరగడం, గాలి నాణ్యత పూర్తిగా పడిపోవడం, కాలుష్యం పెరిగిపోవడం కరోనా థర్డ్ వేవ్ కు కారణమవుతున్నాయి. అలాగే పండుగ సీజన్ కావడంతో ప్రజలు గుంపులుగా బయటకు రావడం కూడా కేసులు పెరగడానికి కారణమవుతోంది.
థర్డ్ వేవ్ మొదలు కావడంతో ఢిల్లీ ప్రభుత్వం బాణసంచా కాల్చడంపై నిషేధం విధించింది. అసలే ఢిల్లీ పొల్యూషన్ కు తోడు బాణసంచా కాల్చడం వల్ల వచ్చే పొగ కూడా తోడైతే కరోనా కేసులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. కనుక ఢిల్లీలో నవంబర్ 7 నుంచి 30 వరకు బాణసంచా కాల్చడంపై సీఎం కేజ్రీవాల్ నిషేధం విధించారు.
ఢిల్లీలో జూన్ 23వరకు ఫస్ట్ వేవ్ కొనసాగింది. ఆ తర్వాత సెప్టెంబర్ 17 నుంచి సెకండ్ వేవ్ మొదలువ్వగా.. ప్రస్తుతం థర్డ్ వేవ్ నడుస్తోంది. గడిచిన 24 గంటల్లో 7,178 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఢిల్లీ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఢిల్లీలో కరోనా వ్యాపించినప్పటి నుంచి అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అలాగే గత మూడు రోజుల నుంచి 6 వేలకు తగ్గకుండా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com