తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం

కరోనా మళ్లీ కమ్ముకొస్తోంది. కొవిడ్ కాస్త తగ్గిందని తేరుకుంటున్న సమయంలో వైరస్ ఉనికిని చాటుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల్లో 32వేల 494 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 94 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8లక్షల 89వేల 503కు చేరింది. ఇప్పటివరకు 7వేల 168 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఏపీలో 603 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
హైదరాబాద్ ప్రకృతి చికిత్సాలయంలో వారం క్రితం వరకు... కరోనా పరీక్షల్లో ఒకటి, రెండు పాజిటివ్‌లు వచ్చేవి. కానీ... వారం రోజుల నుంచి 22 నుంచి 35 మంది వరకు పాజిటివ్‌గా తేలుతోంది. ఫీవర్ ఆస్పత్రిలో వారం రోజుల క్రితం 56 మందికి యాంటిజెన్ పరీక్షలు నిర్వహించగా పది మందికి కరోనా నిర్ధారణ కాగా... తాజాగా 65 మందికి టెస్ట్ చేస్తే 15 మందిలో వైరస్ ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం ఎండ, చలి వాతావరణ సమయంలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని చెస్ట్ హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి.
అటు... దేశవ్యాప్తంగానూ కొత్త కొవిడ్ కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సోమవారంతో పోల్చితే కేసుల సంఖ్య కాస్త పెరిగింది. మంగళవారం 8 లక్షల 5వేల మందికి పరీక్షలు చేయగా.. 13వేల 742 మందికి కరోనా సోకినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య కోటి 10 పదిలక్షల 30వేల 176కి చేరింది. కొత్తగా 14వేల 37మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. మొత్తం రికవరీల సంఖ్య కోటి 7 లక్షల 26వేల 702కు చేరింది. రికవరీ రేటు 97.25శాతంగా కొనసాగుతోంది. 24 గంటల్లో 104 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు... దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. దేశవ్యాప్తంగా రోజుకు 4 లక్షల మందికి టీకా ఇస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం టీకా అందిన వారి సంఖ్య కోటి 20 లక్షలు దాటింది. మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వాళ్లకు టీకా పంపిణీ చేయనున్నారు.
అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ కట్టడికి త్వరలోనే దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో మాస్కులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఇందుకు ఎంత ఖర్చవుతుంది, ఎలాంటి మాస్కులు అందిస్తారనే విషయంపై శ్వేతసౌధం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలోనే మాస్కులు పంపిణీ చేయాలని భావించినప్పటికీ.. అది అమలు కాలేదు. జో బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి వంద రోజులు ప్రతి ఒక్కరు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని కోరారు. ప్రజా రవాణా, కార్యాలయాల్లోనూ మాస్కులు ధరించడాన్ని బైడెన్ తప్పనిసరి చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com