డెల్టా వేరియంట్..వెరీ డేంజర్..అది సోకిన వ్యక్తికి దగ్గరగా వెళ్లినా సరే..

కరోనా వైరస్ ప్రతీకాత్మక చిత్రం
Delta Variant: డెల్టా వేరియంట్ రానురాను అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. ఎలాంటి జాగ్రత్తలు లేకుండా డెల్టా వేరియంట్ సోకిన వ్యక్తికి దగ్గరగా వెళ్లినా సరే.. ఇన్ఫెక్షన్ సోకుతున్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి. ఈ వేరియంట్ బారిన పడ్డ రోగి నుంచి వెయ్యి రెట్లు ఎక్కువగా వైరస్ విడుదల అవుతోందని, బాధితుడికి దగ్గరగా వెళ్లిన 4 రోజుల్లోనే ఇన్‌ఫెక్షన్ సోకుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్‌లో డెల్టా రకం రాకముందు.. ఇన్ఫెక్షన్ సోకానికి ఆరు రోజుల వ్యవధి ఉండేది. కాని, డెల్టా వేరియంట్ విషయంలో ఇది నాలుగు రోజులకు పడిపోయిందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు, డెల్టా రకం వైరస్ వల్ల మరణం సంభవించే ముప్పు రెండింతలు ఉంటోందని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.
డెల్టా వేరియంట్‌ను కట్టడి చేయడానికి ఇప్పుడు తీసుకుంటున్న దానికంటే మించి చర్యలు అవసరం అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా డెల్టా వేరియంట్ సోకిన వారికి దగ్గరగా వెళ్లిన వారిని గుర్తించడానికి సమయం చాలా తక్కువగా ఉంటోందని, దీనివల్ల వైరస్ ఉధృతికి కళ్లెం వేయడం చాలాచాలా కష్టమవుతుందని చెప్పుకొచ్చారు సైంటిస్టులు. ఇప్పటికిప్పుడు వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడం కష్టమని, కాబట్టి వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యలే శరణ్యమని చెబుతున్నారు. పైగా వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా వచ్చే రోగనిరోధక శక్తిని.. డెల్టా రకం వైరస్ కొంతమేర ఏమార్చగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
డెల్టా వేరియంట్ సోకిన బాధితుడికి.. దగ్గరగా వచ్చిన వారిలో 100 శాతం మంది ఇన్‌ఫెక్షన్ బారినపడుతున్నారని ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ అధికారులు తెలిపారు. గత ఏడాది ఇలా ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం 30 శాతం మాత్రమే ఉండేదని, ఇప్పుడు వంద మంది వెళ్తే.. వంద మందికీ వైరస్ సోకుతోందని చెప్పుకొచ్చారు. వైరస్ సోకిన వ్యక్తికి దగ్గరగా వెళ్లిన వాళ్లకు.. కేవలం 24 గంటల్లోనే వైరస్ వ్యాప్తి మొదలవుతున్న ఉదంతాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఫస్ట్‌వేవ్, సెకండ్‌వేవ్‌లో లాక్‌డౌన్లు విధించారు.
డెల్టా వేరియంట్ కారణంగా మరోసారి లాక్‌డౌన్ విధించే పరిస్థితి వస్తుందని చెబుతున్నారు సైంటిస్టులు. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడంతో పాటు డెల్టా వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు బూస్టర్ టీకాలకు కూడా ఆర్డర్లు ఇవ్వాలని ప్రభుత్వాలకు సూచిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాలు సత్వరం స్పందించకపోతే.. లాక్‌డౌన్లు విధించాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com