Covid-19 Variant BF.7: ప్రపంచాన్ని వణికిస్తోన్న వైరస్.. భారత్‌లోనూ బీఎఫ్-7 కేసులు..

Covid-19 Variant BF.7: ప్రపంచాన్ని వణికిస్తోన్న వైరస్.. భారత్‌లోనూ బీఎఫ్-7 కేసులు..
Covid-19 Variant BF.7: కరోనా కొత్తరకం వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. భారత్‌లోనూ బీఎఫ్‌-7 కేసులు నమోదవడంతో కేంద్రం అప్రమత్తం అయింది.

BF-7 in India: కరోనా కొత్తరకం వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. భారత్‌లోనూ బీఎఫ్‌-7 కేసులు నమోదవడంతో కేంద్రం అప్రమత్తం అయింది. ఇవాళ అన్ని రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాండవీయ సమీక్ష చేయనున్నారు. కరోనా టెస్టులు, వ్యాప్తి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమీక్షలో చర్చించనున్నారు. చైనాలో ఈ బీఎఫ్‌-7 వేరియంట్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ, ఇన్‌ఫెక్షన్‌కు కూడా కారణమవుతోంది. నిజానికి ఒక్క చైనాలో తప్ప ఇతర దేశాల్లోనూ బీఎఫ్‌-7 వ్యాప్తి అంత ఉద్ధృతంగా అయితే లేదు. అయినప్పటికీ భారత్‌ చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. డెల్టా, ఒమిక్రాన్‌ లాంటి వేరియంట్లను సమర్థంగా ఎదుర్కొన్న ఇండియా.. బీఎఫ్‌-7 వ్యాప్తిపై కాస్త ఆందోళన చెందుతోంది.


ఓవైపు టీకాలు తీసుకున్నా.. భారతీయుల్లో హైబ్రిట్‌ ఇమ్యూనిటీ ఉన్నా.. బీఎఫ్‌-7పై భారత్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ కొత్త వేరియంట్‌ కలిగించే ఇన్‌ఫెక్షనే ఇందుకు కారణం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఊపిరి ఆడకుండా చేసి, మనిషి చనిపోడానికి కారణం అవుతోంది ఈ బీఎఫ్‌-7. ఇండియాలో ఇలాంటి పరిస్థితి లేనప్పటికీ.. చైనా రిపోర్ట్స్‌ ప్రకారం కొత్త వేరియంట్‌ లక్షణాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఈ వైరస్‌ శ్వాసకోశ సమస్యలను సృష్టిస్తోంది.



ఛాతీ పైభాగం, గొంతుపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటోందని, శ్వాసకోశ సమస్యలు తీవ్రం కావడం వల్ల ఊపిరి తీసుకోవడం కష్టమై వ్యక్తి చనిపోవడానికి అవకాశాలు ఎక్కువ అని చెబుతున్నారు. చైనాలో వయసు మీద పడిన వాళ్లు ఎక్కువగా ఉండడం, అక్కడి ప్రజల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడంతో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని చెబుతున్నారు వైద్యులు. కాని, ఇండియాలో ఇప్పటి వరకు అలాంటి పరిస్థితి తలెత్తలేదు.


ఇండియాలో బీఎఫ్‌-7 ఏమంత ప్రభావం చూపడం లేదంటున్నారు డాక్టర్లు. ఈ కొత్త వేరియంట్‌ జులై నుంచి అక్టోబర్‌ మధ్యలోనే ఇండియాలోకి వచ్చింది. కొత్తగా బయటపడ్డాయని చెబుతున్న నాలుగు కేసులు కూడా అక్టోబర్‌ ముందు నమోదైనవే. అయినప్పటికీ.. భారత్‌లో సాధారణ కరోనా కేసులు రోజుకు 200లకు కంటే తక్కువే నమోదవుతున్నాయి. పైగా బీఎఫ్‌-7 వేరియంట్‌ సోకినా సరే.. ఈ నలుగురూ కోలుకుని పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని వైద్యశాఖ వర్గాలు తెలిపాయి. డెల్టా, ఒమిక్రాన్‌లతో పోల్చుకుంటే బీఎఫ్-‌7 తీవ్రత అంత ఎక్కువేమీ కానప్పటికీ.. వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉండడంతో అత్యధిక మందికి


ఈ కరోనా సోకే అవకాశం ఉందని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. దీని బారిన పడే వారి సంఖ్య అధిక సంఖ్యలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పైగా అంత మంది బాధితులకు వైద్య సదుపాయాలు అందించడం కష్టతరం అవుతాయని చెబుతున్నారు. అందుకే, బీఎఫ్‌-7 వేరియంట్‌పై భారత్‌ అంత ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ముందస్తుగానే హెచ్చరిస్తున్నారు.


ప్రపంచ దేశాల్లో బీఎఫ్‌7 వ్యాప్తి ఉధృతంగా ఉండడంతో.. ప్రధాని మోదీతోపాటు పలువురు వైద్య అధికారులు సమీక్ష నిర్వహించారు. కరోనా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించారు. మాస్క్‌ ధరించాలని, శానిటైజర్‌ ఉపయోగించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రజలను కోరారు. రాబోయే పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని కోరారు.


బీఎఫ్‌7 వ్యాప్తి నేపథ్యంలో భారత్‌-చైనా మధ్య విమానాల రాకపోకలపై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. ఇతర దేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల్లో ర్యాండమ్‌గా 2 శాతం మంది నమూనాలను సేకరించి పరీక్ష చేయాలని నిర్ణయించింది.

Tags

Read MoreRead Less
Next Story