Covid Vaccine: చిన్నారులకు టీకా.. ఎప్పుడంటే?

భారత్‌లో చిన్నారుల కోసం టీకా తీసుకొస్తోంది భారత్ బయోటెక్. వచ్చే రెండు నెలల్లో కొవాగ్జిన్ టీకాను పిల్లలకూ ఇస్తామని ప్రకటించింది. 'కొవాగ్జిన్' టీకా 2 నెలల్లో అందుబాటులోకి తెచ్చేందుకు భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల వెల్లడించారు. ఇప్పటికే రెండేళ్ల వయసున్న పిల్లల నుంచి 18 ఏళ్ల టీనేజర్ల వరకు.. వివిధ కేటగిరీలుగా కొవాగ్జిన్ క్లినికల్ పరీక్షలు జరిపారు. పిల్లలకు టీకా వేయడం సురక్షితమేనని వెల్లడైందని, రోగ నిరోధక శక్తి ఎలా ఉండబోతోందనే దానిపైనే రిపోర్ట్స్ రావాల్సి ఉందని భారత్ బయోటెక్ తెలిపింది. ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ బాగున్నందున రెండు నెలల్లో పిల్లల కోసం వ్యాక్సిన్ తీసుకొస్తామని అనౌన్స్ చేసింది.
కరోనా, రేబిస్‌లకు ఒకే టీకా ఇచ్చే అవకాశాలనూ పరిశీలిస్తున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది. డీ-యాక్టివేటెడ్ రేబిస్ వ్యాక్సిన్ ఉపయోగించి సరికొత్త టీకా తయారుచేస్తున్నారు. దీనిపై ట్రయల్స్ నిర్వహించి పూర్తి స్థాయి టీకాగా తయారుచేసేందుకు భారత్ బయోటెక్ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ రేబిస్ వ్యాక్సిన్ గట్టి రోగనిరోధక శక్తి ఇస్తున్నట్లు తేలిందని, దీనికి కరోనా వైరస్ జోడించి కాంబినేషన్ టీకా తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది.
డాక్టర్ కృష్ణ ఎల్ల 'ఎఫ్‌ఇ హెల్త్‌కేర్ సమిట్'లో మాట్లాడారు. పిల్లలకు ఇచ్చే టీకాలపై రష్యా, అమెరికాలో ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయని చెప్పారు. ముక్కు ద్వారా ఇచ్చే టీకాను భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తుందన్నారు. 'నాసల్ వ్యాక్సిన్'పై ప్రస్తుతం ప్రయోగాలు నిర్వహిస్తున్నామని, 2,3 నెలల్లో ఫలితాలు వెల్లడవుతాయన్నారు. దీంతోపాటు ఒక డోసు కొవాగ్జిన్, మరో డోసు కింద నాసల్ వ్యాక్సిన్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
సింగిల్ డోస్ కరోనా టీకా తీసుకొచ్చేందుకు డాక్టర్ రెడ్డీస్ రెడీ అవుతోంది. భారత్‌లో ప్రస్తుతం కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను రెండు డోసులుగా వేస్తున్నారు. కాని, రష్యా తయారుచేసిన స్పుత్నిక్ లైట్ ఒక్క డోసు వేస్తే చాలు. ఇండియాలో స్పుత్నిక్ లైట్ ఇచ్చేందుకు క్లినికల్ ట్రయల్స్ చేపడుతోంది డాక్టర్ రెడ్డీస్. స్పుత్నిక్ వ్యాక్సిన్‌పై రష్యాలనే భారీ ఎత్తున క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్‌కు 15 దేశాలకు అనుమతి లభించింది. ఈ సమాచారాన్నంతా డీసీజీఐకి సమర్పించింది డాక్టర్ రెడ్డీస్. వీటి ఆధారంగా వచ్చే రెండు మూడు నెలల్లో క్లినికల్ ట్రయల్స్‌కు వెళ్తోంది. అతి త్వరలోనే స్పుత్నిక్ లైట్ టీకాను భారత మార్కెట్లోకి తీసుకొస్తామని డాక్టర్ రెడ్డీస్ తెలిపింది.
అమెరికాలో ఇప్పటికే పిల్లలకు టీకా ఇవ్వడం మొదలుపెట్టారు. ఫైజర్-బయాన్‌టెక్ టీకాకు అమెరికాలో అత్యవసర అనుమతి ఇచ్చారు. భారత్‌లో మాత్రం 18 ఏళ్లు నిండిన వారికే టీకాలు ఇస్తున్నారు. కొవాగ్జిన్‌పై భారత్ బయోటెక్ ప్రయోగాలు సక్సెస్ అయితే.. భారత్‌లో చిన్న పిల్లలకు ఇచ్చేందుకు అనుమతి పొందిన తొలి టీకా అవుతుందని సంస్థ తెలిపింది. ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందు టీకాపై ప్రయోగాలు చేస్తోంది భారత్ బయోటెక్, వచ్చే 2,3 నెలల్లో వీటి రిజల్ట్స్ వస్తాయని, డీసీజీఐ అనుమతిస్తే.. ఒక డోసు కొవాగ్జిన్, మరో డోసు కింద నాసల్ వ్యాక్సిన్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు స్పష్టంచేసింది.
కొవిషీల్డ్ తీసుకున్న అందరూ మూడో డోసు తీసుకుంటే మంచిదంటూ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్ పూనావాలా విజ్ఞప్తి చేశారు. మరోవైపు భారత్ సహా పలు దేశాల్లో నకిలీ కొవిషీల్డ్ వ్యాక్సిన్లు బయటపడుతున్నాయి. ఉగాండా సహా ఆఫ్రికా, ఆగ్నేయ ఆసియా దేశాల్లో నకిలీ కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఆ వ్యాక్సిన్లు నకిలీవేనని సీరం ఇన్‌స్టిట్యూట్ కూడా ధ్రువీకరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com