DMK : కుర్చీ తొందరగా తేలేవా.. రాయితో కొట్టిన మంత్రి

DMK : కుర్చీ తొందరగా తేలేవా.. రాయితో కొట్టిన మంత్రి
కార్యకర్త కుర్చీ లేటుగా తెచ్చాడని రాయితో కొట్టిన తమిళనాడు పాలు, పాడిపరిశ్రమ శాఖ మంత్రి, డీఎంకే నాయకుడు ఎస్ఎమ్ నాసర్...

కొందరు ప్రజాప్రతినిధుల వింత చేష్టలు అంతా ఇంతా కావు. మాటలు తూలే వారు కొందరైతే, క్రమశిక్షణ పేరుతో బహిరంగంగా కార్యకర్తలపై చేయి చేసుకునే వారు ఇంకొందరు. అలాంటి ఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది.

తమిళనాడుకు చెందిన పాలు, పాడిపరిశ్రమ శాఖ మంత్రి, డీఎంకే నాయకుడు ఎస్ఎమ్ నాసర్ ఓ కార్యకర్తను రాయితో కొట్టాడు. కూర్చోవడానికి కుర్చీని లేటుగా తెచ్చిన కారణంగా మంత్రి ఈ చర్యకు పాల్పడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బుధవారం తమిళనాడు సీఎం స్టాలిన్, తిరువళ్లూరులో పర్యటించనున్నారు. సభ జరిగే ప్రాంగణాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఎస్ఎమ్ నాసర్. సభా ప్రాంగణం చుట్టూ తిరుగుతూ పనులను పర్యవేక్షిస్తున్న మంత్రికి ఓ చెట్టు నీడన చల్లగాలికి కూర్చోవాలని అనిపించింది. వెంటనే పార్టీ కార్యకర్తకు చెప్పి కుర్చీ తీసుకురమ్మన్నాడు.

కుర్చీకోసం వెళ్లిన వ్యక్తి కాస్త లేటుగా వచ్చేసరికి నాసర్ కు కోపం వచ్చింది. ఎంతసేపు నేను నిలపడాలి తొందరగా రాలేవా అంటూ చిన్నపిల్లాడిలా కిందకు వంగి ఓ గులకరాయిని తీసుకుని కార్యకర్తపై విసిరాడు. అప్పటికే రికార్డింగ్ లో ఉన్న మీడియా కెమెరాలు తమ పనిని పూర్తి చేశాయి. అంతే క్షణాల్లో మంత్రి వీడియో దేశం మొత్తం వైరల్ అయింది.

సీఎం మీటింగ్..

తమిళనాడులో హిందీ భాషకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో కొందరు ప్రాణాలు విడిచారు. మరణించిన వారి స్మారకాన్ని ఏర్పాటు చేసేందుకు బుధవారం తమిళనాడు సీఎం స్టాలిన్ తిరువళ్లూరులో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి 'వీర వనక్కం' అని పేరు పెట్టారు.

Tags

Read MoreRead Less
Next Story