Omicron Variant: థర్డ్‌ వేవ్‌ మాత్రమే కాదు.. ఇకపై వరుసగా వేవ్‌లు తప్పవా..?

Omicron Variant (tv5news.in)

Omicron Variant (tv5news.in)

Omicron Variant: ఒమిక్రాన్ పేరు వింటేనే ప్రపంచం మొత్తం వణికిపోతోంది.

Omicron Variant: ఒమిక్రాన్ పేరు వింటేనే ప్రపంచం మొత్తం వణికిపోతోంది. థర్డ్‌వేవ్‌ వచ్చేస్తోందని ప్రపంచ దేశాలు ఆందోళన పడుతున్నాయి. మళ్లీ లాక్‌డౌన్‌ పెట్టి ఇంట్లోనే కూర్చునే పరిస్థితులు రాబోతున్నాయని ఇండైరెక్టుగా చాటింపు వేస్తున్నాయి. నిజానికి, ఇప్పటి వరకు ఒమిక్రాన్ కారణంగా ఒక్కరు కూడా చనిపోలేదు. అసలు ఒమిక్రాన్‌ ఎంత వేగంగా వ్యాపిస్తుంది? ఈ కొత్త వేరియంట్ చేసే నష్టం ఏంటి? ఎలాంటి అనారోగ్యాలు కలుగుతాయన్న దానిపై స్పష్టత లేదు.

ఇప్పుడిప్పుడే పరిశోధనలు జరుగుతున్నాయి. వీటి ఫలితాలు వస్తే తప్ప ఒమిక్రాన్‌ ఎంత డేంజర్ అనేది తెలీదు. కాకపోతే, పరిశోధనల ఫలితాలు వచ్చి.. ఒమిక్రాన్‌ మహా డేంజర్‌ అని తేలితే.. అప్పటికే జరక్కూడని నష్టం జరిగిపోతుంది. అందుకే, ప్రపంచ దేశాలన్నీ ఒమిక్రాన్‌కు వణికిపోతున్నాయి. కర్నాటకలో అప్పుడే ఒమిక్రాన్‌ భయాలు మొదలయ్యాయి.

దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరిలో ఒకరి నమూనా డెల్టా వేరియంట్‌కు భిన్నంగా ఉందని అక్కడి మంత్రి డాక్టర్ సుధాకర్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. గత తొమ్మిది నెలలుగా డెల్టా వేరియంట్ మాత్రమే ఉనికిలో ఉంది. కాని, సౌతాఫ్రికా నుంచి బెంగళూరు వచ్చిన ఇద్దరిలో ఒకరి నమూనా డెల్టావేరియంట్‌కు భిన్నంగా కనిపించింది. అయితే, అది ఒమిక్రానా కాదా అనేది ఇప్పటికిప్పుడు అధికారికంగా ఏమీ చెప్పలేమని.. కేంద్ర ఆరోగ్య శాఖ, ICMRతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు.

ఒకవేళ బెంగళూరు వచ్చిన ఆ ఇద్దరిలో ఒకరికి ఒమిక్రాన్‌ ఉన్నట్టు తేలితే మాత్రం దేశంలో అదే తొలి కేసు అవుతుంది. ఒమిక్రాన్‌ సోకిన వారిలో తీవ్రమైన కండరాల నొప్పి కనిపిస్తోంది. కనీసం నిలబడలేనంతగా అలసత ఉంటోంది. రెండు మూడు రోజుల పాటు తీవ్ర జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, ఛాతి నొప్పి, ఒళ్లు నొప్పులు, పొడి దగ్గు కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఒమిక్రాన్‌ రోగ నిరోధక శక్తిని దెబ్బతీస్తోందని వైద్యులు చెబుతున్నారు. రుచి, వాసన లేకపోవడం, ఊపిరితిత్తులపైనా, ఆక్సీజన్ లెవెల్స్‌పైనా ప్రభావం చూపుతోందని చెబుతున్నారు. అందుకే, ఒమిక్రాన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. థర్డ్‌ వేవ్‌ మాత్రమే కాదు.. ఇకపై వరుసగా వేవ్‌లు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించింది.

ఒమిక్రాన్‌ కారణంగా మరో వేవ్‌ తలెత్తితే పరిణామాలు చాలా దారుణంగా ఉండొచ్చని చెబుతోంది. పైగా దక్షిణాఫ్రికాలో కనిపించింది కాబట్టి అక్కడే ఆగిపోతుందని చెప్పడానికి వీల్లేదని, ఒమిక్రాన్‌ అన్ని దేశాలకూ వ్యాపించే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. అందుకే, ప్రపంచ దేశాలు దీనిపై అప్రమత్తతతో వ్యవహరిస్తున్నాయి.

దక్షిణాఫ్రికాలో కనిపించిన ఒమిక్రాన్‌.. కెనడా, బ్రిటన్‌, స్కాట్లాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ, బెల్జియం, డెన్మార్క్‌ దేశాల్లోనూ బయటపడింది. విచిత్రం ఏంటంటే.. అసలు దక్షిణాఫ్రికా కాదు కదా.. ఆఫ్రికాలోని ఏ దేశంలోనూ పర్యటించని వారికి కూడా ఒమిక్రాన్ సోకింది. పోర్చుగల్‌కు చెందిన 13 మంది సాకర్‌ క్లబ్‌ జట్టు సభ్యులకు కొత్త వేరియంట్‌ నిర్ధారణ అయింది.

స్కాట్లాండ్‌లో ఆరుగురికి ఒమిక్రాన్‌ సోకింది. వీరిలో కొందరికి అసలు ఆఫ్రికా దేశాల్లో పర్యటించిన చరిత్రే లేదు. అయినా సరే కొత్త వేరియంట్ సోకింది. నెదర్లాండ్స్‌లో 13 మందికి, ఆస్ట్రేలియాలో ఐదుగురికి, జర్మనీలో ముగ్గురికి, కెనడా, హాంకాంగ్‌లో ఇద్దరికి చొప్పున వైరస్ నిర్ధారణ అయింది. మరోవైపు ఒమైక్రాన్‌ ఆందోళనతో జపాన్‌ సరిహద్దులను మూసివేసింది.

ఒమిక్రాన్‌ పుట్టుక.. టీకా పంపిణీలో దేశాల మధ్య ఉన్న అసమానతలకు ప్రతిరూపమని డబ్ల్యూహెచ్‌వో అభిప్రాయపడింది. నిపుణులు సైతం టీకాలు విస్తృతంగా ఇవ్వకపోవడం వల్లే ఒమిక్రాన్‌ పుట్టి ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. వ్యాక్సినేషన్‌ తక్కువగా ఉన్న ప్రాంతంలో వైరస్‌ వ్యాప్తి పెరిగి కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది.

దక్షిణాఫ్రికాలో వ్యాక్సినేషన్‌ రేటు 24 శాతం మాత్రమే. అందుకే, దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ పుట్టుకొచ్చిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌కు సంబంధించిన స్పైక్‌ ప్రోటీన్‌లో 32 ఉత్పరివర్తనాలు ఉన్నట్లు తేలింది. వ్యాప్తిని అధికం చేసే మ్యూటేషన్లతో పాటు రోగనిరోధకతను ఏమార్చే మార్పులూ ఇందులో ఉన్నాయని వెల్లడైంది. అందుకే, ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉందనే ఆందోళన మొదలైంది.

అనేక మార్పులతో పుట్టుకొచ్చిన ఒమిక్రాన్‌ వ్యాప్తి వేగంగా ఉండొచ్చని ఓ అంచనా. బాధితుల్లో తీవ్రస్థాయి అనారోగ్యానికి దారితీయవచ్చని, టీకా తీసుకున్నవారికి కూడా ఒమిక్రాన్‌ సోకే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాంకాంగ్‌లో ఒమిక్రాన్‌ సోకిన ఇద్దరు వ్యక్తులు ఫైజర్‌ టీకా తీసుకున్నవారు ఉన్నారు. అయినా సరే వారిలో ఒమిక్రాన్‌ లక్షణాలు బయటపడ్డాయి.

ఒమిక్రాన్‌పై రెండు వారాల్లో కచ్చితమైన సమాచారం వచ్చే అవకాశం ఉందని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఒమిక్రాన్‌ ఎదుర్కొవాలంటే టీకా ఒక్కటే మార్గమని.. మాస్క్, భౌతిక దూరం పాటించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాక్సిన్లు వేయించుకోని వారితో పోలిస్తే.. డబుల్ డోస్ తీసుకున్న వారు ఒమిక్రాన్ వైరస్ బారిన పడే అవకాశాలు దాదాపు లేనట్లేనని చెబుతున్నారు.

Tags

Next Story