Editorial: "నమ్మిన నేతలకు జగన్ పంగనామాలు..?"

Editorial: నమ్మిన నేతలకు జగన్ పంగనామాలు..?
వైసీపీకి అన్ని విధాలా అండగా నెల్లూరు జిల్లా; అన్నీ ఇచ్చిన జిల్లాపైనే ముఖ్యమంత్రి వివక్ష; అటు అభివృద్ధి, ఇటు రాజకీయంగా మొండిచేయి; నమ్మకున్న వారికి పంగనామాలు పెడుతున్న అధినేత; అదును చూసి దెబ్బకొట్టేందుకు చూస్తున్న ఆశావహులు?



నెల్లూరు జిల్లా... జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఇది ఇవ్వలేదు అని లేకుండా అన్నీ ఇచ్చింది. పదికి పది నియోజకవర్గాల ఎమ్మేల్యేలను ఇచ్చింది. తిరుపతితో కలుపుకొని రెండు ఎంపీ స్థానాలిచ్చింది. జడ్పీ స్థానాలను గంపగుత్తుగా చేతిలో పెట్టింది. ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, మేయర్, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు ఇలా చెప్పుకుంటు పోతే నెల్లూరు జిల్లా రుణం తీర్చుకోలేనంతగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రుణపడిపోయాడు. ఇంత చేసిన నెల్లూరు జిల్లాకు ముఖ్యమంత్రి మాత్రం అవకాశం వచ్చిన ప్రతీసారి సీతకన్నేస్తున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లాకు, జిల్లా నాయకత్వానికి ప్రాధాన్యత విషయంలో వెనుక వరుసలో నిలబడాల్సి వస్తుందన్న ఆవేదనలో ఉన్నారట జిల్లా వైసీపీ నేతలు. జిల్లాకు కొత్త పరిశ్రమలు మంజూరు చేయటం దేవుడెరుగు ఉన్న పరిశ్రమలు కాకెత్తుకెళ్తున్నట్టు మాయమైపోతున్నాయట.


ఇటు రాజకీయంగా నెల్లూరు జిల్లాకు మెండి చెయ్యేనంటున్నారట వైసీపీ నేతలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొరకు, తన రాజకీయ ఎదుగుదలకు చేసిన త్యాగాలను గుర్తుకు తెచ్చుకుంటే ముందు వరుసలో నిలిచేది నెల్లూరు జిల్లా. ఎంపీ, ఎమ్మెల్యే పదవులను జగన్మోహన్ రెడ్డి కొరకు త్యాగాలు చేసిన వారు నెల్లూరు జిల్లా నేతలు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా మారిన తరువాత జిల్లాలోని నేతలపై చిన్న చూపు చూస్తున్నాడన్న విమర్శలు వ్యక్తమౌతున్నాయి. జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీని ఎదిరించి ఓదార్పు యాత్ర చేపట్టినప్పుడు నెల్లూరు పర్యటనకు ముందు వచ్చిన స్పందన ఒకెత్తయితే.. నెల్లూరు పర్యటన తరువాత వచ్చిన ఆదరణ మరో ఎత్తని చెబుతుంటారు. ఇన్ని త్యాగాలు, ఇంత నమ్మకం పెట్టుకున్న నెల్లూరు నేతలకు పదవుల పందేరం విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెనకడుగు వేస్తున్నాడు?. ఎమ్మెల్సీ పదవుల్లో సీనియర్లకు, ముందు నుండి పార్టీని నమ్మకున్న వారికి ఎందుకు పంగనామాలు పెడుతున్నాడు?. ఏళ్ల తరబడి ఆశలు పెట్టుకున్న నేతలు ఇప్పుడేమంటున్నారు?. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా?. అదును చూసి జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలని చూస్తున్నారా?. అన్న చర్చ జోరుగా జరుగుతోంది.


నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులుగా నెల్లూరు, తిరుపతి జిల్లాలకు చెందిన విద్యా, వ్యాపార వేత్తలను బరిలోకి దించింది వైసీపీ అధిష్టానం. అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత సతమతమవుతోంది. ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోగా.. కొత్త సమస్యలను సృష్టిస్తున్న జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా బలమైన వారిని బరిలోకి దించడం ఎన్నికల ఎత్తుగడల్లో భాగమే.. కాదనడం లేదు. కానీ స్థానిక సంస్థ ఎన్నికల్లో అవకాశం వచ్చినప్పుడు అండదండలు అందించాల్సిన అధినాయకత్వం ఎందుకు మోకాలడ్డుకుందో అర్ధం కావడం లేదంటున్నారట వైసీపీ ఆశావహులు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్షానికి ఎన్నికల్లో గెలిచే మెజార్టీ లేకపోయినా.. అధిష్టానం ఆదేశించిందని వ్యయప్రయాసలకోర్చి బరిలో నిలిచి ఆర్థికంగా నష్టపోయిన వారిని కూడా పార్టీ ఇప్పుడు పట్టించుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


పోయిన దఫా స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు జిల్లా నుండి ఆనం కుటుంబాన్ని ఎదిరించి జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన వ్యక్తి.. ఆనం వివేకానంద రెడ్డి, రామనారాయణ రెడ్డిల సోదరుడు ఆనం విజయ కుమార్ రెడ్డిని బరిలోకి దింపాడు జగన్మోహన్ రెడ్డి. నాటి ఎన్నికల్లో వైసీపీకి బలం లేకున్నా పోటీలో నిలిచి అతి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు ఆనం విజయకుమార్ రెడ్డి. అయినప్పటికీ నాటి నుండి పార్టీనే నమ్ముకుని ఉన్నాడు. నెల్లూరు రూరల్లో బలమైన నేతగా ఉన్న విజయ కుమార్ రెడ్డి... సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పార్టీని విడిచిపెట్టి బయటకు వెళ్లిపోయినా.. నేనున్నానంటూ ముందుకొచ్చి నిలబడ్డాడు. నెల్లూరు రూరల్ పై మెదటి నుండి గంపెడాశలు పెట్టుకున్న ఈయన... బాధ్యతలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధమని ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించాడు. అయినా అధిష్టానానికి విజయ కుమార్ రెడ్డి విజ్జప్తి చేరలేదు. వారువీరు చెప్పుకుంటున్నట్టు పోయిన దఫా చేజారిపోయిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కట్టబెట్టనున్నట్టు వినికిడి రావడంతో శాంతించాడట. అనుకోకుండా, అనూహ్యంగా అదీ కూడా చేజారిపోయింది. ఎన్నో ఏళ్లుగా గంపెడాశలతో ఎదురు చూసిన పదవి కళ్లముందే వేరొకరి వశం కావడంతో నిరాశలో ఉన్నాడట విజయకుమార్ రెడ్డి.


ఇటు స్థానిక సంస్థ ఎమ్మెల్సీగా మేరిగ మురళి అభ్యర్థిత్వ ప్రకటనపై పార్టీలో చాలామంది పెదవి విరుస్తున్నారట. ఇంత కాలంగా పార్టీకోసం అహర్నిషలు కష్టపడిన తమను గుర్తించలేదన్న వాదన బలంగా వినిపిస్తోందట. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గానికి ఒకరు చొప్పున గత ఎన్నికల్లో ఎమ్మెల్యే రేసులో ఉండి సీటు రానివారు... ఈ ఎన్నికల్లోనైనా పోటీలో ఉండవచ్చులే అనుకున్నారు. కానీ ప్రజల్లో పార్టీ మీద వ్యతిరేకత వ్యక్తమౌతుండటం.. గెలుపు పైన ధీమా లేకపోవడంతో ఈ ఎమ్మెల్సీ పదవైన చేజిక్కించుకోవాలని ఆశపడిన వారెందరో ఉన్నారట. అంతెందుకు గూడూరు నియోజకవర్గం నుండి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ప్రకటించబడిన మేరిగ మురళి.. గత ఎన్నికల్లో గూడూరు సీటు ఆశించి దగా పడ్డ నేతే. అయితే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వరప్రసాద్ పై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమౌతుండటంతో... రిజర్వేషన్ ప్రకారం ఈసారైనా అదృష్టం వరిస్తుందిలే అనుకున్నాడట. అయితే అనుకోకుండా ఎమ్మెల్సీ వచ్చి పడటంతో నియోజకవర్గంలో మిగిలిన వారు అలకపాన్పు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారట. గూడూరు నియోజకవర్గంలో విజయం సాధించాలంటే ఇక్కడున్న రెడ్డి సామాజికవర్గాన్ని ప్రసన్నం చేసుకోక తప్పదు. అలాంటి వారికి ఎమ్మెల్యేగా పోటీలో నిల్చునే అవకాశం ఎలాగూ ఉండదు కాబట్టి.. రెడ్డి సామాజికవర్గంలో ఒకరికి ఎమ్మెల్సీ వస్తుందిలే అనుకున్నారు అందరు. అయితే అందరి ఆలోచనలను, అంచనాలను తలకిందులు చేస్తూ మేరిగ మురళిని ప్రకటించింది వైసీపీ అధిష్టానం.


మేరిగ మురళితో గూడూరులొ నలుగురు శాసన మండలి, శాసన సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే వరప్రసాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగా.. దివంగత ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మరణానంతరం దుర్గా ప్రసాద్ తనయుడు కళ్యాణ్ కి ఎమ్మెల్సీ ఇచ్చాడి జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి బరిలో ఉన్నాడు. ఇప్పుడు స్థానిక సంస్థ ఎమ్మెల్సీగా మేరిగ మురళితో నలుగురు ప్రజా ప్రతినిధులు ఒక్క గూడూరు నుండే ఉండటంతో.. గూడూరుకే ఎందుకంత ప్రాధాన్యతంటూ మిగిలిన నియోజకవర్గాల వైసీపీ నేతలు గుర్రుగా ఉన్నారట. దీంతో ఎమ్మెల్సీ ఆశించి బంగపడ్డా నేతలను సముదాయించే పనిలో పడిందట నెల్లూరు జిల్లా నాయకత్వం. ఇది టీ కప్పులో తుఫాన్ లా ముగుస్తుందా లేక సునామీలా తుడిచి పెట్టుకు పోతుందా అనేది రాబోయే ఎన్నికల్లో తేలిపోనుంది.

Tags

Read MoreRead Less
Next Story