Prashant Kishore : ప్రశాంత్‌ కిశోర్‌ సంచలన నిర్ణయం..!

Prashant Kishore : ప్రశాంత్‌ కిశోర్‌ సంచలన నిర్ణయం..!

ప్రశాంత్‌ కిషోర్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు. పార్టీ పెడుతున్నట్టు ప్రకటించేశారు. పార్టీ పేరు, విధానాలను త్వరలో ప్రకటిస్తామంటూ ట్వీట్ చేశారు. ప్రశాంత్‌ కిషోర్‌ సొంత రాజకీయ పార్టీ నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, ప్రశాంత్ కిషోర్‌ ఉన్నట్టుండి, హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోలేదు. గతంలో చాలాసార్లు దీనిపై హింట్‌ ఇస్తూ వచ్చారు. బెంగాల్, తమిళనాడులో పార్టీలను గెలిపించిన తరువాత.. ఇకపై వ్యూహకర్తగా ఉండబోనంటూ ప్రకటన చేశారు. మున్ముందు తనను కొత్త రోల్‌లో చూస్తారంటూ చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే.. తాను వేరు, ఐప్యాక్‌ వేరు అంటూ కొద్ది రోజులుగా స్టేట్‌మెంట్స్ సైతం ఇస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీతో జరిపిన చర్చల సందర్భంలోనూ తాను ఐప్యాక్‌తో ఉండబోనంటూ చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు.

బీహార్‌ నుంచి తన రాజకీయ ప్రయాణం మొదలవుతుందని ట్వీట్‌ చేశారు ప్రశాంత్ కిషోర్. బీహార్‌ నుంచే ఎందుకు అనే ప్రశ్నకు రాజకీయ విశ్లేషకులు కొన్ని కారణాలు చెబుతున్నారు. గతంలో ప్రశాంత్‌ కిషోర్ జేడీయూ పార్టీలో చేరినప్పుడు... నితీశ్‌ కుమార్‌ పార్టీలో పెద్ద పోస్టే ఇచ్చారు. పార్టీ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవితో పాటు యువజన వ్యవహారాల విభాగాన్ని కూడా పీకే చేతిలో పెట్టారు. ఆ సమయంలో బీహార్‌లోని విద్యార్ధి సంఘాలను బలోపేతం చేశారు పీకే. దశాబ్దాలుగా యూనివర్సిటీల్లో పాతుకుపోయిన విద్యార్ధి సంఘాలను పెకిలించి, జేడీయూ విద్యార్ధి విభాగాన్ని బలోపేతం చేశారు.

దేశంలో సమూల మార్పులు రావాలంటే యువత రాజకీయాల్లోకి రావాలంటూ పిలుపునిచ్చారు. కొత్త తరం రాజకీయ నాయకులు యూనివర్సిటీల నుంచే పుట్టుకురావాలని ఆకాంక్షించారు. అలా బీహార్‌ యూత్‌లో పీకే తన స్ట్రాటజీని అప్లై చేశారు. ప్రశాంత్ కిషోర్ నిర్వహిస్తున్న ఐప్యాక్‌ సంస్థకు దేశవ్యాప్తంగా వాలంటీర్లు, ఉద్యోగులు ఉన్నప్పటికీ.. ప్రత్యేకంగా బీహార్‌లో పీకే టీమ్‌ చాలా బలంగా ఉంది. ఐప్యాక్‌ ద్వారా యువత రాజకీయాల్లోకి రావాలనే నినాదాన్ని బలంగా చేరవేశారు. యువత కోసం స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టారు. బీహార్‌లో గ్రామ స్థాయి నుంచి యూత్‌ కమిటీలు సైతం ఏర్పాటు చేశారు.

ప్రశాంత్‌ కిషోర్‌ పార్టీ పెట్టడం వెనక కారణం ఏంటి? ప్రత్యేకంగా ఏ కారణాలు ఉన్నాయి? ఇప్పటి వరకు ఏర్పడిన పార్టీలకు ఏదో ఒక సెంటిమెంట్‌ ఉంది. ప్రతి సెంటిమెంట్ వెనక సిద్ధాంతపరమైన మద్దతు ఉంది. ఆ సెంటిమెంట్‌ నేపథ్యంలోనే కొత్త రాజకీయ వేదికలు, కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచి టీఆర్ఎస్ పుట్టింది. ఇండియా అగైనెస్ట్‌ కరెప్షన్‌ అనే ఉద్యమం నుంచి ఆమ్‌ఆద్మీ పార్టీ పుట్టుకొచ్చింది. కొన్ని సందర్భాల్లో పార్టీ సిద్ధాంతాలను విభేదించి కొత్త పార్టీలు పెట్టుకున్నారు. వైసీపీ, ఎన్‌సీపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ అలా పుట్టుకొచ్చినవే. కాని, ప్రశాంత్‌ కిషోర్‌ పార్టీ పుట్టుకకు మాత్రం ఎలాంటి సెంటిమెంట్‌ నేపథ్యమూ లేదు. కేవలం బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ పార్టీ పెడుతున్నారు. బీజేపీని వ్యతిరేకించే వారే పీకే పార్టీ మద్దతుదారులు. అంతేతప్ప పీకే పార్టీ పుట్టుకకు ఎలాంటి సిద్ధాంతపరమైన కారణాలూ లేవంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

2014లో బీజేపీని ఢిల్లీ గద్దెనెక్కించడం, ఆ తరువాత పంజాబ్‌లో కాంగ్రెస్‌ను గెలిపించడం, వైసీపీ, డీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్‌ కోసం పనిచేయడం.. ఇలా రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిషోర్‌కు అనుభవం ఉంది. పైగా పలు రాష్ట్రాల్లో ఐప్యాక్‌ తరపున పనిచేసిన వాలంటీర్లు, ఉద్యోగుల బలం ఉంది. దాదాపుగా అన్ని రాష్ట్రాల స్థితిగతులు, రాజకీయ నేపథ్యాలూ, బలాబలాలు కూడా తెలుసు. బహుశా ఆ అనుభవంతోనే పార్టీ పెట్టారని విశ్లేషిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story