RajyaSabha :రాజ్యసభ స్థానాల భర్తీకి త్వరలో ఎన్నికలు

RajyaSabha : రాజ్యసభ స్థానాల భర్తీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెలలో ఖాళీ కానున్న 13 సీట్లకు ఈనెల 31న ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారు చేసింది. ఈ ఎన్నికల నిర్వహణకు ఈనెల 14న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 21వ తేదీకల్లా నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. వచ్చిన నామినేషన్లను 22న పరిశీలిస్తారు. 24 వరకు అభ్యర్థులు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. 31న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదేరోజున సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు.
పదవీకాలం ముగుస్తున్న రాజ్యసభ సభ్యులలో కేరళ నుంచి ఏకే ఆంటోనీ, హిమాచల్‌ప్రదేశ్ నుంచి ఆనంద్ శర్మ, ప్రతాప్ సింగ్ బజ్వా, నరేష్ గుజ్రాల్ వంటి ప్రముఖులు ఉన్నారు. రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ, ఆనంద్ శర్మ, బజ్వాలు కాంగ్రెస్‌కు చెందిన వారు కాగా, గుజ్రాల్.. శిరోమణి అకాలీదళ్‌కు చెందిన వారు. పంజాబ్ నుంచి 5 సీట్లు ఖాళీ అవుతుండగా, కేరళలో 3, అసోంలో 2, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, త్రిపురల నుంచి ఒక్కో సీటు ఖాళీ కానుంది. ఏప్రిల్ రెండో 2న అసోం, హిమాచల్‌ప్రదేశ్, కేరళ, నాగాలాండ్, త్రిపుర నుంచి రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ పొందనున్నారు. పంజాబ్ నుంచి ఐదుగురు సభ్యులు ఏప్రిల్ 9న రిటైర్ కానున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 2వ తేదీకి ముందే ఎన్నికలు ముగిసేలా షెడ్యూల్ ఖరారు చేశారు.
రాష్ట్ర శాసనసభ్యుల దామాషా ప్రాతినిధ్య ఓట్ల ఆధారంగా రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు. ఇక 13 రాజ్యసభ స్థానాల్లో పంజాబ్ నుంచి ఐదు, కేరళ నుంచి మూడు, అస్సాం నుంచి రెండు, హిమాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, త్రిపుర నుంచి ఒక్కొక్కటి చొప్పున భర్తీ చేయనున్నారు. కాగా ఎన్నికల నిర్వహణలో కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com