CDS Bipin Rawat: దేశానికి ఎంతో సేవ చేసిన వ్యక్తికి మంచి నీళ్లు ఇవ్వలేకపోయా: ప్రత్యక్షసాక్షులు కన్నీటిపర్యంతం

CDS Bipin Rawat: శత్రుదేశ సైనికులను గడగడలాడించిన పోరాట యోధుడు బిపిన్ రావత్ తన చివరి క్షణాలు ఇలా ముగియడం అత్యంత బాధాకరం. తమిళనాడులోని కున్నూరు సమీపంలో హెలికాప్టర్ కూలిన ఘటన దృశ్యాలు భీతావహం. అక్కడి పరిస్థితులను చూసిన కొందరు ప్రత్యక్షసాక్షులు భయకంపితులయ్యారు.
మధ్యాహ్న సమయంలో మేం పనిచేస్తున్న ప్రాంతానికి సమీపంలో భారీ శబ్ధం వినిపించింది. అక్కడకు వెళ్లి చూస్తే ఓ హెలికాప్టర్ మంటల్లో కాలుతూ కనిపించింది. దట్టమైన పొగ రావడంతో ముందు మాకెవరూ కనిపించలేదు. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు నేలపై పడి ఉండడాన్ని చూశాము.
వారి దగ్గరకు వెళ్లడానికి ముందు భయం వేసింది. అయినా ధైర్యం చేసి వెళ్లాము.. వారికి ఏ విధంగా అయినా సాయపడాలని అనుకున్నాం. ఆ సమయంలో ఓ వ్యక్తి మంచి నీళ్లు కావాలని అడిగారు. కానీ సమయానికి అక్కడ తాగేందుకు నీళ్లు లేకపోవడంతో బాధ అనిపించింది. ఆ తర్వాత రెస్క్యూ టీం వచ్చి ఆయనను తీసుకెళ్లారు.
తాము మాట్లాడిన వ్యక్తి సీడీఎస్ జనరల్ రావత్ అని, దేశానికి సేవ చేసిన గొప్ప వ్యక్తి అని కొందరు వ్యక్తుల ద్వారా తెలుసుకున్నాము. దేశం కోసం సేవ చేసిన వ్యక్తికి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయామని చాలా బాధపడ్డాము అని ప్రత్యక్షసాక్షులు కన్నీటి పర్యంతం అయ్యారు.
కాగా, సీడీఎస్ రావత్‌ను ఆస్పత్రికి తీసుకువెళుతున్న సమయంలో మార్గమధ్యంలోనే మరణించారు. ఆయన తన పేరును రక్షణశాఖ సిబ్బందికి హిందీలో చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com