అంతకంతకు పెరుగుతున్న వైరస్ తీవ్రత.. 3వ స్థానంలో భారత్..

అంతకంతకు పెరుగుతున్న వైరస్ తీవ్రత..  3వ స్థానంలో భారత్..

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది.. గడిచిన 24 గంటల్లో 79 వేల కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఒక రోజులో ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవడం దేశంలో ఇదే తొలిసారి. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇది రికార్డు. జులై 25న అమెరికాలో ఒక్కరోజులో 78 వేల 427 కేసులు నమోదైతే ఇప్పుడు మన దగ్గర 78 వేల 903 కేసులు వచ్చాయి. USలో 76 వేలకుపైగా కేసులు పలు సందర్భాల్లో నమోదైనా.. ఈ వారం రోజుల నుంచే భారత్‌లో కరోనా మీటర్ మరింత పైపైకి వెళ్తోంది. ఈ వారం రోజుల వ్యవధిలోనే దేశంలో 4 లక్షల 96 వేల మంది అంటే దాదాపుగా 5 లక్షల మంది కోవిడ్ బారిన పడ్డారు. దేశవ్యాప్తంగా ఇప్పటికి కరోనా కేసుల సంఖ్య 35 లక్షలు దాటేసింది. దేశవ్యాప్తంగా సగటున గత వారం రోజులుగా 70 వేల 867 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక నిన్న ఒక్కరోజే ఏకంగా 945 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇక రాష్ట్రాల వారీగా చూస్తే ఇప్పటికీ మహారాష్ట్రలో కరోనా కబళిస్తూనే ఉంది. ఆదివారం 16 వేల 408 కేసులు నమోదయ్యాయి. 296 మంది కరోనా కారణంగా చనిపోయారు. గతంలో ముంబైలో తీవ్రత ఎక్కువగా కనిపించగా.. ఇప్పుడు కట్టడిలోకి వచ్చింది.. అదే సమయంలో ఇతర జిల్లాలకు వైరస్‌ వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది.. తమిళనాడులో ప్రస్తుతం కేసుల తీవ్రత తగ్గి 6 వేలకు వచ్చినా గతంలో నమోదైన పాజిటివ్ కేసుల్ని బట్టి చూస్తే దేశంలో రెండో స్థానంలో ఉంది. కర్నాటక, యూపీలోనూ కరోనా కట్టడికి ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. కర్నాటకలో ఆదివారం కొత్తగా 8852 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. దీంతదో అక్కడ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలా 35వేలా 928కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 5589కి చేరింది.ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులను ఓసారి చూస్తే ఇప్పటికీ అమెరికానే తీవ్రంగా ఎఫెక్ట్ అయిన లిస్టులో ఫస్ట్ ఉంది. ఆ తర్వాత బ్రెజిల్ ఉంటే, 3వ స్థానంలో భారత్ ఉంది. అమెరికాలో మరణాలు కూడా ఇప్పటికి లక్షా 87 వేలకు చేరువ అయ్యాయి.

మరోవైపు కరోనా బారిన పడుతున్న నేతల సంఖ్య పెరిగిపోతోంది.. రాజస్థాన్ కేబినెట్ మంత్రి ప్రతాప్ ఖచరియవాస్ కరోనా బారినపడ్డారు. తనకు కరోనా సోకిన విషయాన్ని మంత్రి స్వయంగా వెల్లడించారు. తనతో కాంటాక్ట్ అయిన వాళ్లంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తనలో కొన్ని లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్ష చేయించుకున్నానని, ఫలితాల్లో తనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని తెలిపారు. ఇటీవల తనను కలిసిన ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story