దేశంలో జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్.. వ్యాక్సిన్ తీసుకునే ముందు..

దేశంలో జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్.. వ్యాక్సిన్ తీసుకునే ముందు..
తొలుత ఫ్రంట్ లైన్ కరోనా వారియర్స్ కు, ఆ తర్వాత 50 ఏళ్లకు పైబడిన వారికి టీకా ఇవ్వనున్నారు.

భారతీయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. ఈనెల 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు కానుంది. తొలి విడతలో మూడు కోట్ల మందికి వ్యాక్సిన్ అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత ఫ్రంట్ లైన్ కరోనా వారియర్స్ కు, ఆ తర్వాత 50 ఏళ్లకు పైబడిన వారికి టీకా ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వ్యాక్సిన్ నిల్వ కేంద్రాలకు వ్యాక్సిన్ సరఫరా ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

ప్రధాని మోదీ ఉన్నతాధికారులతో శనివారం అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై చర్చించారు. వ్యాక్సిన్ పంపిణీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన మార్గదర్శకాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈనెల 11న వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.. ప్రాధాన్యతా క్రమంలో టీకాలు ఎలా వేయాలన్న దానిపై చర్చించనున్నారు.

వ్యాక్సిన్‌ పంపిణీని ప్రణాళికాబద్ధంగా అమలు చేసేలా రాష్ట్రాలను ఇప్పటికే కేంద్రం అప్రమత్తం చేసింది. వ్యాక్సిన్లను సేఫ్‌గా స్టోర్‌ చేసేందుకు దేశవ్యాప్తంగా మొత్తం 29 వేల కోల్డ్‌ చైన్‌ పాయింట్లు సిద్ధమయ్యాయి. వ్యాక్సిన్‌ తయారీ కంపెనీలు ముంబై, చెన్నై, కోల్‌కతా, కర్నాల్‌, హర్యానాలోని ప్రభుత్వ మెడికల్‌ స్టోర్‌ డిపార్ట్‌మెంట్‌ డిపోలకు వ్యాక్సిన్లను చేర్చనున్నాయి. ఆ తర్వాత వ్యాక్సిన్లు రాష్ట్రాల్లోని వ్యాక్సిన్ల స్టోర్లకు చేరుతాయి. అక్కడ్నుంచి జిల్లాలు, అటు నుంచి పీహెచ్‌సీలకు తరలిస్తారు. పీహెచ్‌సీల నుంచే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరుగుతుంది.

రోజుకు లేదా సెషన్‌కు వందమందికి వ్యాక్సిన్ ఇస్తారు. తొలి విడత పూర్తయిన తరువాత రెండో విడతలో మిగిలినవారికి ఇస్తారు. 50 ఏళ్లు పైబడిన వారిని రెండు గ్రూపులుగా విభజిస్తారు. 50 నుంచి 60, 60 కంటే పైన ఉన్న వాళ్లుగా విభజించి వ్యాక్సిన్ అందిస్తారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా ప్రక‌టించిన ఓట‌రు జాబితా ప్రకారం వయోవృద్ధుల ఎంపిక జరుగుతుంది. హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు నిర్ధారిత సెషన్ కేంద్రాల్లోనూ.. హైరిస్క్ వారికి సెషన్ సైట్స్ లేదా మొబైల్ సైట్స్‌లో వ్యాక్సిన్ అందిస్తారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో వ్యాక్సిన్ ఎప్పుడు ఎక్కడ ఇచ్చేది స్పష్టంగా చెప్పాలి.

వ్యాక్సిన్ తీసుకునే ముందు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో వారికి స్లాట్ల ఆధారంగా వ్యాక్సిన్ ఇస్తారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం కోవిన్ వెబ్‌సైట్ అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు వ్యాక్సిన్ పంపిణీకు సిబ్బందికి శిక్షణ ఉంటుంది. వ్యాక్సిన్ బృందంలో ఐదు మంది ఉంటారు. ఒక డాక్టర్ , స్టాఫ్ నర్స్, ఫార్మసిస్టు, సహాయక నర్శు, లేడీ హెల్త్ విజిటర్ ఉంటారు. పోలీసు, హోంగార్డు, సివిల్ డిఫెన్స్, నేషనల్ క్యాడెట్ కార్ప్స్, నేషనల్ సర్వీస్ స్కీమ్ నుంచి ఒక వ్యాక్సినేషన్ ఆఫీసర్ ఉంటారు.

ఎంట్రీ పాయింట్ వద్ద చెకింగ్ అనంతరం లోపల మరో వ్యాక్సినేషన్ ఆఫీసర్ వివరాలు సరి చూసుకుంటారు. ఆ తరువాత వ్యాక్సిన్ వేసి దానిపై అవగాహన కల్పిస్తారు. వ్యాక్సిన్ కోసం ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు.ఎంతమందికి ఇచ్చారనే వివరాల్ని రియల్ టైమ్‌లో తెలుసుకునేందుకు.. కోవిడ్ 19 వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ సిస్టమ్‌ను ప్రత్యేకంగా అందుబాటులో తీసుకొస్తారు. యాడ్వర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ సర్వైలెన్స్ వ్యవస్థ ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిని పర్యవేక్షిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story