చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు భారత్ కసరత్తు

చైనా దురుసు వైఖరికి గట్టిగా చెక్ పెట్టేందుకు భారత్ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కోవడానికి వీలుగా ప్రత్యేక బలగాలను దించింది. తాజాగా నౌకాదళంలోని మెరికల్లాంటి మెరైన్ కమాండోలను మోహరించింది. ముఖ్యంగా పాంగాంగ్ సరస్సు వద్ద ఇరు దేశాల బలగాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో రెండు పక్షాలూ పోటాపోటీగా సైనికులను, భారీ ఆయుధాలను మోహరించాయి. చైనా దుందుడుకు చర్యలను మెరుపు వేగంతో అడ్డుకట్ట వేసేందుకు అవసరమైతే ప్రతిదాడికి దిగేందుకు వాయు సేనకు చెందిన గరుడ్ కమాండోలను తూర్పు లద్దాఖ్‌కు తరలించింది.
ఎల్‌ఏసీ వెంబడి కేంద్ర కేబినెట్ ఆధ్వర్యంలో పనిచేసే రహస్య దళం స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్‌ను కూడా రంగంలోకి దిగింది. త్రివిధ దళాల మధ్య మరింత సమన్వయం సాధించడంతోపాటు అత్యంత వాతావరణ పరిస్థితులను పరిచయం చేసే ఉద్దేశంతో వీరిని దించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇక పాంగాంగ్ సరస్సులో విధుల నిర్వహణ కోసం అధునాతన బోట్లనూ వీరికి సమకూర్చనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com