దారి తప్పి పాకిస్థాన్‌కు వెళ్లి.. ఎట్టకేలకు ఇండియాలో తల్లిన కలిసిన గీత

దారి తప్పి పాకిస్థాన్‌కు వెళ్లి.. ఎట్టకేలకు ఇండియాలో తల్లిన కలిసిన గీత
9 ఏళ్ల వయస్సులో తప్పిపోయి, పాకిస్థాన్‌లో పెరిగి పెద్దయి తిరిగి భారత్‌కు వచ్చిన గీత.. ఎట్టకేలకు తన తల్లిని కలుసుకుంది

ఐదేళ్ల గీతాన్వేషణ ఫలించింది. 9 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు తప్పిపోయి, పాకిస్థాన్‌లో పెరిగి పెద్దయి తిరిగి భారత్‌కు వచ్చిన గీత.... ఎట్టకేలకు తన తల్లిని కలుసుకుంది. మహారాష్ట్రలోని పర్భనీ జిల్లాకు చెందిన మీనా.. గీత తల్లిగా దాదాపు నిర్ధారణ అయింది. ఈ మేరకు గీత ఆశ్రయం పొందుతున్న స్వచ్ఛంద సంస్థ ఆనంద్‌ సర్వీస్‌ సొసైటీ ఓ ప్రకటన చేసింది. గీత గురించి మీనా వాకబు చేసిన సమయంలో ఎన్జీవో అధికారులు కొన్ని ప్రశ్నలు అడిగారు. నా కుమార్తె పొట్టపై కాలిన మచ్చ ఉంటుందని మీనా చెప్పారు. అది నిజమేనని తేలింది. దీంతో మీనా.. గీత తల్లే అని దాదాపు నిర్ధరించారు. అయితే అధికారులు ఇంకా డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించలేదు. గీత అసలు పేరు రాధ అని, తాము పర్భనీ జిల్లాలోని జింతూర్‌లో ఉండేవాళ్లమని మీనా తెలిపారు. అయితే మీనా భర్త సుధాకర్‌ కొన్నేళ్ల క్రితం చనిపోయారు. తర్వాత మీనా రెండో పెళ్లి చేసుకొని ఔరంగాబాద్‌లో నివాసం ఉంటున్నారు.

చిన్న వయసులోనే దారి తప్పి పాకిస్థాన్ కు వెళ్లిన గీత.. 2015 అక్టోబర్ 26న నాటి విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ సాయంతో భారత్ కు తిరిగొచ్చింది. ఆమెను మొదట ఇండోర్ లోని ఓ స్వచ్ఛంద సంస్థలో చేర్చారు. మాటలు రాకపోవడం, చెప్పింది వినపడకపోవడం వంటి కారణాలతో పర్భణీలోని పహల్ అనే స్వచ్ఛంద సంస్థలో సంజ్ఞల భాషపై శిక్షణనిచ్చారు. ఐదేళ్ల పాటు అక్కడే ఉన్న ఆమెను.. గత ఏడాది జులై 20న ఇండోర్ కే చెందిన మరో స్వచ్ఛంద సంస్థ ఆనంద్ సర్వీసెస్ సొసైటీకి అప్పగించింది పహల్. ఈ ఐదేళ్లలో ఆ రెండు స్వచ్ఛంద సంస్థలు గీత తల్లిదండ్రుల కోసం వెతికాయి.

గీత తల్లిదండ్రుల కోసం అందరం ఎంతో వెతికామని, ఆ ప్రయత్నాలు ఫలించాయని ఆనంద్ సర్వీసెస్‌కు చెందిన జ్ఞానేంద్ర పురోహిత్ అనే సభ్యుడు చెప్పారు. గీత తమ కూతురేనంటూ తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, రాజస్థాన్‌లకు చెందిన అనేక కుటుంబాలు వచ్చాయని, చివరకు మహారాష్ట్రలోని పర్భణీలోనే గీత తల్లిదండ్రులున్నట్టు తేలిందని చెప్పారు. ఇక గీత నిజంగానే మీనా కూతురో కాదో తేల్చేందుకు డీఎన్ఏ పరీక్షలు చేయాల్సి ఉంది. డీఎన్ఏ పరీక్షలు ఎప్పుడు చేస్తారన్నది ప్రభుత్వమే నిర్ణయించాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story