ట్విటర్‌కు భారత్‌కి మధ్య వార్.. స్పందించిన అమెరికా

ట్విటర్‌కు మన కేంద్ర ప్రభుత్వానికి మధ్య వార్ నడుస్తోంది. సాగు చట్టాలపై రైతులను రెచ్చగొట్టేలా ఉన్న అకౌంట్లను తొలగించే విషయంలో ట్విటర్ అనుసరిస్తున్న తీరుపై కేంద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫేక్ న్యూస్, హింసను ప్రోత్సహించేలా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విటర్‌కు సంబంధించి రాజ్యసభలో ప్రస్తావించారు. భారత్‌లో కోట్ల మంది యూజర్లు ఉన్నారు. వ్యాపారం చేసుకోవడానికి, ఆదాయం పొందడానికి తగినంత స్వేచ్ఛ ఉంది. కానీ తప్పకుండా భారత రాజ్యాంగాన్ని అనుసరించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం చర్యలు తప్పవని చాలా సీరియస్‌గా చెప్పారు రవిశంకర్ ప్రసాద్.
కేంద్రం సీరియస్ కావడానికి మరో కారణం ట్విటర్ చేపట్టిన చర్యనే. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై తీసుకున్న చర్యలను, కేంద్రం వాదనను ట్విటర్ తన బ్లాగులో బహిరంగంగా పోస్ట్ చేసింది. అయితే ట్విటర్ తీరుపై మన కేంద్ర ప్రభుత్వం కూ అనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అమెరికా క్యాపిటల్ హిల్ భవనంపై దాడి జరిగినప్పుడు ట్విటర్ వ్యవహరించిన తీరుకు.. ప్రస్తుత తీరు పూర్తి భిన్నంగా ఉందని కేంద్రం మండిపడింది. ఇక ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోతే.. ట్విటర్ ఉన్నతాధికారుల అరెస్టు తప్పదని కేంద్రం హెచ్చరించినట్లు జాతీయ మీడియాలో కథనం వచ్చింది.
మోదీ ప్లానింగ్ ఫార్మర్ జీనోసైడ్ అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్విటర్‌లో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు వచ్చాయి. అయితే వీటిని వెంటనే బ్లాక్ చేయాలని.. చట్టం ప్రకారం 257 URLSను తొలగించాలని కేంద్రం ఆదేశించింది. దీంతో ట్విటర్ వాటిని తొలగించకుండా హైడ్ చేసింది. ఆ తర్వాత వాడిని సడెన్‌గా పునరుద్ధరించింది. వాటిలో ఉన్న కంటెంట్‌ను వాక్స్వాతంత్ర్యానికి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు నిదర్శనంగా భాష్యం చెప్పింది. దీనిపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విటర్‌కు నోటీసులు పంపింది. తమ ఆదేశాలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని.. ట్విటర్ ఉన్నతాధికారులు ఏడేళ్ల దాకా జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఒకవైపు ఇదంతా జరుగుతుండగానే రైతుల ఆందోళనకు మద్దతిస్తూ కొందరు విదేశీ సెలబ్రిటీలు చేసిన ట్వీట్లను ట్విటర్ సీఈవో జాక్ డోర్సే లైక్ చేశారు. దీనిపై కేంద్ర సర్కారు తీవ్రస్థాయిలో మండిపడింది. అంతేకాదు పాకిస్థానీ, ఖలిస్థానీ వినియోగదారులకు చెందిన మరో ఒకవేయి 178 అకౌంట్లను బ్లాక్ చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత ట్విటర్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ మహిమా కౌల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ట్విటర్ కేవలం 500 అకౌంట్లపైనే చర్యలు తీసుకుంది.
ట్విటర్ తీరుపై ఆగ్రహంతో ఉన్న కేంద్రం.. దేశీయంగా తయారైన కూ యాప్‌ను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు, ఎంపీలు ఇందులో అకౌంట్లు ఓపెన్ చేశారు. దీంతో కూ డౌన్‌లోడ్‌ల సంఖ్య 30 లక్షల మార్కు దాటింది. కేంద్రం నిర్వహించిన ఆత్మనిర్భర్ యాప్ చాలెంజ్‌లో భాగంగా.. బెంగళూరుకు చెందిన ఒక స్టార్టప్ సంస్థ ఈ యాప్‌ను తయారు చేసింది. దీని సహవ్యవస్థాపకులు అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ బిద్‌వాత్కా. ఇక ట్విటర్‌లో ఉన్న అన్ని ఫీచర్లూ ఇందులో ఉన్నాయి. అంతేకాదు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ భాషల్లో దీన్ని అందుబాటులోకి తెచ్చారు.
మరోవైపు భారత్- ట్విటర్ మధ్య వార్ నడుస్తుండడంతో అమెరికా స్పందించింది. భావ ప్రకటన స్వేచ్ఛకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా మేం భావప్రకటన స్వేచ్ఛతో సహా ప్రజాస్వామ్య విలువలకు కట్టబడి ఉన్నాం అని విదేశాంగ ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు. అటు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు శాశ్వతంగా గుడ్‌బై చెప్పింది ట్విటర్. ట్రంప్‌కు ఇంకెప్పుడూ ట్విటర్‌లోకి అనుమతించేది లేదని ఆ సంస్థ తేల్చి చెప్పింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com