IT Raids in Telugu States: రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇళ్లల్లోనూ ఐటీ తనిఖీలు

IT Raids in Telugu States: తెలుగు రాష్ట్రాల ప్రముఖులను ఐటీ షేక్ చేస్తోంది. తెల్లవారుజాము నుంచి నాన్‌స్టాప్ తనిఖీలు చేస్తోంది. మొదట ఒకరిద్దరి ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయని వార్తలు వచ్చినప్పటికీ.. మొత్తం 36 చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి.
వైసీపీ నేత దేవినేని అవినాశ్.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇళ్లల్లో సోదాలు గట్టిగానే సాగుతున్నాయి. విజయవాడలోని దేవినేని అవినాశ్ ఇంటి మెయిన్ డోర్ మూసేసి, కేంద్ర బలగాలను రంగంలోకి దించి మరీ తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు. గుణదలలోని అవినాశ్ నివాసంలో ఉదయం ఆరున్నర నుంచి సోదాలు చేస్తున్నారు. బంజారాహిల్స్‌లో ఓ భూమి వ్యవహారంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లోని రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇళ్లల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. వంశీరామ్ బిల్డర్స్ ఇళ్లు, కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వంశీరామ్ బిల్డర్ సుబ్బారెడ్డితో పాటు ఆయన బావమరిది జనార్ధన్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపడుతున్నారు. హైదరాబాద్, విజయవాడతో పాటు నెల్లూరులోనూ వంశీరామ్ బిల్డర్స్‌కు చెందిన సీఈవో, డైరెక్టర్లు, పెట్టుబడిదారుల కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఈ తనిఖీల్లో 20కిపైగా బృందాలు పాల్గొంటున్నాయి.
వంశీరామ్ బిల్డర్స్‌పై తనిఖీల్లో భాగంగానే వైసీపీ నేతల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో వైసీపీ నేత దేవినేని అవినాష్‌కు చెందిన స్థలం డెవలప్‌మెంట్ కోసం వంశీరామ్ బిల్డర్స్ తీసుకుంది. ఒప్పందంలో భాగంగా జరిగిన లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఈ మధ్యే మంత్రి మల్లారెడ్డి ఇళ్లతో పాటు ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో రెండు రోజుల పాటు ఐటీ సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు, బంగారం సీజ్ చేశారు. విచారణకు రావాల్సిందిగా మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులకు నోటీసులు పంపింది. తాజాగా ఆదాయపు పన్నుశాఖ అధికారులు తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహించడం ఆసక్తి రేపుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com