Tamilnadu: జయలలిత, శోభన్ బాబు నా తల్లిదండ్రులు.. తెరపైకి మరో కూతురు..

Tamilnadu: కొన్ని సంఘటనలు మిష్టరీలుగా మిగిలి పోతుంటాయి. వాస్తవం ఏమిటో వారికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఒకవేళ ఆ విషయాలు మిగిలిన వారికి తెలిసినా బయటపెట్టే సాహసం చేయరు.. ఎన్నేళ్లు గడిచినా అవి రూమర్లుగానే చెలామణి అవుతుంటాయి. జయలలిత వారసులం తామే అంటూ ఇదివరకు తెరపైకి చాలా మందే వచ్చినప్పటికీ ఎవరు అసలైన వారసులు అనేది ఇంతవరకు తెలియదు..
అయితే తాజాగా మరో మహిళ మీనాక్షి తన తల్లిదండ్రులు శోభన్ బాబు, జయలలిత అని చెబుతోంది.. చెన్పై పోయెస్ గార్డెన్ లో ఉన్న తన తల్లి మృతి చెందిందని, తనకు వారసత్వ సర్టిఫికెట్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంది. మధురై తిరువళ్లువర్ నగర్ కు చెందిన మురుగేశన్ భార్య మీనాక్షి. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు మురుగేశన్. మీనాక్షి మధురై తాలుకా కార్యాలయానికి వచ్చి వారసత్వ సర్టిఫికెట్ కావాలని అధికారులతో వాగ్వివాదానికి దిగింది. దీంతో అధికారులు జయలలిత మృతి చెందింది చెన్నై కావడంతో అక్కడికే వెళ్లి అడగమని చెప్పారు.
ఇందుకు నిరాకరించిన మీనాక్షి తన తల్లిదండ్రులు తనను అనాధగా వదిలి వెళ్లారని కన్నీళ్లు పెట్టుకుంది. పళనిలో బంగారు రథం లాగే హక్కు తన తండ్రి శోభన్ బాబు తనకు ఇచ్చాడని చెబుతోంది. దానికి సంబంధించిన పత్రాలు కూడా తన దగ్గర ఉన్నాయని అంటోంది. ఇప్పుడు వారసత్వ సర్టిఫికెట్ అడిగితే ఎందుకు ఇవ్వరు అని అధికారులను ప్రశ్నిస్తోంది.
దీంతో తల పట్టుకున్న తాలూకా కార్యాలయం అధికారులు.. న్యాయస్థానానికి వెళ్లి మీ హక్కులు చెప్సి ఆదేశాలు తీసుకోమన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మీనాక్షి.. చిన్నతనంలోనే తన తల్లి తనను దూరం చేసుకుందని తెలిపింది. బామ్మ తనను పెంచి పెద్ద చేసిందని తెలిపింది. తానే జయలలిత నిజమైన వారసురాలని అని పేర్కొంది. కోర్టుకు వెళ్లడం గురించి లాయర్ తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానంది. కాగా, గతంలో కూడా ఇలాగే ఇద్దరు మహిళలు తాము జయలలిత వారసులం అని కలకలం రేకెత్తించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com