Karnataka: ఐఏఎస్‌ vs ఐపీఎస్‌

Karnataka: ఐఏఎస్‌ vs ఐపీఎస్‌
కన్నడనాట మహిళా ఐఏఎస్, మహిళా ఐపీఎస్‌ మధ్య సోషల్‌ మీడియా యుద్ధం

కన్నడనాట మహిళా ఐఏఎస్, మహిళా ఐపీఎస్‌ మధ్య సోషల్‌ మీడియా యుద్ధం తీవ్రంగా సాగుతోంది. ఐఏఎస్‌ రోహిణి సింధూరికి వ్యతిరేకంగా ఐపీఎస్‌ రూపా మౌద్గిల్‌ ఫేస్‌బుక్‌లో తీవ్ర విమర్శలతో పోస్ట్‌లు చేశారు. అందులో రోహిణి సింధూరి వ్యక్తిగత ఫొటోలను పోస్ట్‌ చేసి ఆమె పాల్పడుతున్న అక్రమాలు ఇవీ అని పలు ఆరోపణలు చేశారు. ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రూపా ప్రస్తుతం హోంగార్డ్స్‌ ఐజీగా ఉండగా, రోహిణి సింధూరి దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్‌గా ఉన్నారు.

గతేడాది మైసూరు కలెక్టర్‌గా పనిచేసిన రోహిణి సింధూరి బదిలీ సమయంలో క్యాట్‌లో కేసు వేయగా, ఆమె తరఫున రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ వాదించి సహకరించారని, కన్నడిగులైన తమలాంటి వారికి ఎందుకు ఇటువంటి వెసులుబాటు ఇవ్వలేదని రూపా ప్రశ్నించారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో అనేక ఫోటోలను, సుదీర్ఘమైన వాదనలను పోస్ట్‌ చేశారు. తాను 3 సంవత్సరాల కిందట యాదగిరిలో పనిచేసి, బెంగళూరుకు బదిలీ అయినప్పుడు మరో అధికారి క్యాట్‌లో కేసు వేస్తే అప్పుడు నా తరఫున ఏజీ ఎందుకు వాదించలేదు అన్నారు. రోహిణి వ్యక్తిగత ఫొటోలను ఇతర ఐఏఎస్‌లకు పంపించారని, ఇది సర్వీస్‌ రూల్స్‌ను అతిక్రమించడమేనని, ఇంకా అనేక ఆరోపణలను రూపా సంధించారు.

ఐపీఎస్‌ రూప నా ప్రైవేటు పోటోలు విడుదల చేయడం పై న్యాయపోరాటం చేస్తానని ఐఏఎస్‌ రోహిణి సింధూరి తెలిపారు. ఫొటోలను బయటపెట్టడం, నిరాధార ఆరోపణలు చేయడంతో రూపా తనపై దుష్పప్రచారం సాగిస్తోందని ఫైర్‌ అయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story