ఢిల్లీ టూర్‌లో మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసిన కేసీఆర్

ఢిల్లీ టూర్‌లో మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసిన కేసీఆర్

సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్‌లో భాగంగా ఆదివారం కూడా కేంద్ర మంత్రులను కలవనున్నారు. నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌తో సీఎం కేసీఆర్ సమావేశమవుతారు. దీర్ఘకాలికంగా పెండిగ్‌లో ఉన్న పలు సమస్యలపై చర్చిస్తారు. ముఖ్యంగా జాతీయ రహదారులకు నిధుల మంజూరుపై కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో చర్చించనున్నారు. ఇక రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఎఫ్‌ఆర్‌బీఎం పెంపుపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చిస్తారు.

మూడురోజుల ఢిల్లీలో టూర్‌లో భాగంగా ఇప్పటికే ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు కేంద్ర జల‌వ‌న‌రు‌ల‌శాఖ మంత్రి షెకా‌వ‌త్‌, పౌర‌వి‌మా‌న‌యాన మంత్రి హర్దీ‌ప్‌‌సింగ్‌ని కలిశారు. నీటి ప్రాజెక్టులు, తెలంగాణలో ఏర్పాటు చేయాలనుకున్న ఎయిర్‌పోర్టుల విషయంపై చర్చించారు. ఇవాళ నితిన్‌ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌తో భేటీ అనంతరం.. సాయంత్రం హైద‌రా‌బా‌ద్‌ చేరుకుంటారు. జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు బీజేపీతో యుద్ధమే అని ప్రకటించిన కేసీఆర్.. వెనువెంటనే ఢిల్లీ వెళ్లడం, కేంద్ర పెద్దలను కలవడంపై పెద్ద చర్చ జరుగుతోంది. వ్యవసాయ చట్టాలపై బహిరంగంగా నిరసన తెలిపిన కేసీఆర్.. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను కలవకుండానే హైదరాబాద్ వచ్చేస్తున్నారు.

డిసెంబర్‌ రెండో వారంలో బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలతో హైదరాబాద్‌లోనే సమావేశం పెడతానని సీఎం కేసీఆర్ గ్రేటర్ ప్రచారంలో చెప్పారు. ఈ సమావేశానికి సీఎం మమతా బెనర్జీ, మాజీ సీఎంలు కుమార స్వామి, అఖిలేశ్ యాదవ్, మాయావతి, స్టాలిన్ హాజరుకానున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ వెళ్లడం, మోదీతో సహా కేంద్రమంత్రులను కలవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


Tags

Next Story