KCR Delhi Tour: కేసీఆర్ ఢిల్లీ టూర్‌తో పాలమూరుకు మంచి రోజులు వచ్చేనా?
KCR Delhi Tour: సీఎం కేసీఆర్ ఐద్రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. శుక్రవారం ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్... కేంద్ర హోం శాఖ సమావేశంలో పాల్గొనడంతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఐదు రోజుల పర్యటన ముగించుకుని.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు.
శనివారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిశారు. కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాలు, నదీ యాజమాన్య బోర్డుల పరిధి నోటిఫికేషన్ సంబంధిత అంశాలపై చర్చించారు. రాయలసీమ ఎత్తిపోతలతో పాలమూరుకు జరుగుతున్న నష్టాన్ని కేంద్రమంత్రికి వివరించారు. తెలుగురాష్ట్రాల కృష్ణాజలాల వివాదంపై చర్చించారు.
పాలమూరు- రంగారెడ్డికి అనుమతులు, నీటి కేటాయింపులు చేయాలని షెకావత్‌ను సీఎం కేసీఆర్ కోరారు. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ గెజిట్ అమలు తేదీ వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ప్రాజెక్టులనే నోటిఫికేషన్ పరిధిలోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. పాలమూరు ప్రజాప్రతినిధులతో కలిసి షెకావత్‌ను సీఎం కలిశారు.
ఆదివారం నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఆది, సోమవారాల్లో అమిత్ షాతో సీఎం కేసీఆర్... మళ్లీ విడిగా కూడా భేటీ అయ్యారు. సమావేశం తర్వాత.. నార్త్‌బ్లాక్‌లోకి హోంమంత్రి అమిత్ షాతో కేసీఆర్ ఏకాంతంగా సమావేశమయ్యారు. ఆదివారం రాత్రి కూడా అమిత్ షాను ఆయన నివాసంలో సీఎం కలిశారు. గంటన్నర పాటు వివిధ అంశాలపై చర్చించారు. అమిత్‌షాతో కేసీఆర్ వరుసగా రెండ్రోజుల పాటు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. వివిధ అంశాలపై ఇరువురి మధ్య కీలకచర్చ జరిగినట్లు తెలుస్తోంది.
కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తోనూ సీఎం కేసీఆర్.. శని, ఆదివారాల్లో సమావేశమయ్యారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై పీయూష్ గోయల్‌తో కేసీఆర్ చర్చించారు. రాష్ట్రంలో భారీగా వరి సాగు చేస్తున్న నేపథ్యంలో ఎఫ్‌సీఐ ద్వారా బియ్యం కొనుగోళ్లు, నిల్వలు అధికంగా ఉన్న నేపథ్యంలో విదేశాలకు ఎగుమతులు లాంటి అంశాలపై చర్చించారు. కేంద్ర మంత్రులతో భేటీలు ముగించుకున్న కేసీఆర్... ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమై వచ్చారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com