Maharashtra: రైతు ఖాతాలో రూ.15 లక్షలు జమ.. ఆర్నెల్ల తరువాత బ్యాంక్ నుంచి ఫోన్..

Maharashtra: రైతు ఖాతాలో రూ.15 లక్షలు జమ.. ఆర్నెల్ల తరువాత బ్యాంక్ నుంచి ఫోన్..
Maharashtra: మోదీ దయవల్ల ఇల్లు కట్టుకుంటున్నానని ఎంతో సంతోషించాడు.. కానీ ఇంతలోనే పిడుగులాంటి వార్త.

Maharashtra: ఔరంగాబాద్‌లోని పైథాన్ తాలూకాకు చెందిన జ్ఞానేశ్వర్ ఓటే అనే వ్యక్తికి తన అకౌంట్‌లో పడ్డ రూ.15 లక్షలు చూసి మొదట ఆశ్చర్యపోయాడు. తరువాత 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రతి పౌరుడికి రూ. 15 లక్షలు ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ గుర్తుకు వచ్చి సంతోషించాడు.. కేంద్ర ప్రభుత్వం తన ఖాతాలో డబ్బు జమ చేసిందని భావించి మోదీకి కృతజ్ఞతలు కూడా తెలిపాడు.

అయితే అంత డబ్బు వచ్చినా ఏదో అనుమానం.. ఎందుకైనా మంచిదని ఇరుగు పొరుగు వారిని అడిగాడు. తనలాంటి రైతులకే మరెవరికైనా అంత డబ్బు జమ అయిందో లేదో కనుక్కున్నాడు. ఎవరూ తమకు రాలేదంటే తమకు రాలేదని అన్నారు.. అలాగే కొన్ని నెలలు వేచి ఉన్నాడు. బ్యాంకు అధికారులు కూడా ఈ విషయంపై తనను సంప్రదించకపోవడంతో ఆ డబ్బుతో ఇల్లు కట్టుకుందామనుకున్నాడు. రూ.9 లక్షలు డ్రా చేసి ఇంటి కోసం ఖర్చు పెట్టాడు.

మోదీ దయవల్ల ఇల్లు కట్టుకుంటున్నానని ఎంతో సంతోషించాడు.. కానీ ఇంతలోనే పిడుగులాంటి వార్త. పొరపాటున తన ఖాతాలో డబ్బు జమ అయిందని, పూర్తి మొత్తాన్ని తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని బ్యాంకు నుంచి నోటీసు వచ్చింది.

ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ డబ్బును పింపాల్‌వాడి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రయోజనాల కోసం కేటాయించారు, కాని పొరపాటున బ్యాంక్ ఆఫ్ బరోడా ఆ మొత్తాన్ని జ్ఞానేశ్వర్ ఖాతాలో జమ చేసింది. "ఆ డబ్బును ప్రధాని మోదీ పంపారని నేను అనుకున్నాను. ఇప్పటికే రూ. 6 లక్షలను బ్యాంకుకు తిరిగి చెల్లించాను"అని రైతు తెలిపాడు. ఇంటి నిర్మాణానికి ఖర్చు చేసిన మొత్తం రూ.9 లక్షలు ఇంకా చెల్లించాల్సి ఉంది.

ఇలాంటి కేసు ఇదేమీ మొదటిది కాదు. గత ఏడాది ప్రారంభంలో, బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో రామ్ బహదూర్ షా అనే వృద్ధ రైతు ఖాతాలో రూ. 52 కోట్లు జమ అయ్యాయి. కతిహార్‌లోని 6వ తరగతి చదువుతున్న ఇద్దరు పాఠశాల విద్యార్థులు లక్షాధికారులు అయ్యారు. సాకేంతిక లోపం కారణంగా ఇలాంటివి తలెత్తుతుంటాయని బ్యాంకు అధికారులు చెబుతుంటారు.

ఖగారియా జిల్లాకు చెందిన రంజిత్ దాస్ అనే వ్యక్తి బ్యాంకు ఖాతాలోకి రూ.5.5 లక్షలు వచ్చి చేరాయి. దాస్ ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి రైతుకి రూ.15 లక్షలు హామీ ఇచ్చారని, ఇది మొదటి విడత అని ఆయన పేర్కొన్నారు. అతను డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో, బ్యాంకు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ప్రస్తుతం అతడు జైలులో ఉన్నాడు. చేయని పొరపాటుకి పాపం వాళ్లు శిక్ష అనుభవిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story