మహారాష్ట్రలో మరోసారి లాక్‌డౌన్ తప్పదా..?

మహారాష్ట్రలో మరోసారి లాక్‌డౌన్ తప్పదా..?
మహారాష్ట్రలో మరోససారి లాక్ డౌన్ తప్పదా..? శనివారం ఒక్క రోజులోనే 10వేలకు పైగా కొత్త కేసులు నమోదవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

మహారాష్ట్రలో మరోససారి లాక్ డౌన్ తప్పదా..? శనివారం ఒక్క రోజులోనే 10వేలకు పైగా కొత్త కేసులు నమోదవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏడాదికాలంగా కంటి మీద కునుకులేకుండా చేస్తున్న కరోనా.. మహారాష్ట్రలో మళ్లీ పడగ విప్పుతుంది. ఒకవైపు దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ కార్యక్రమం జరుగుతున్నా.. పలు రాష్ట్రాలలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. మహారాష్ట్రలో మాత్రం వైరస్ కోరలు చాస్తుంది. శనివారం అక్కడ 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. నవంబర్ తర్వాత మహారాష్ట్రలో ఈస్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి.

కరోనా కొత్త స్ట్రైయిన్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. శనివారం ఒక్కరోజే మహారాష్ట్రలో 10వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21 లక్షలు దాటింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా టెస్టుల సంఖ్యను కూడా పెంచుతున్నారు. గడిచిన 24 గంటల్లో అక్కడ 80వేలకు పైగా టెస్టులు నిర్వహించారు. ప్రస్తుతం అక్కడ 4లక్షల మంది పైగా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. సుమారు 4వేల మంది ఆస్పత్రులు, క్వారంటైన్ కేంద్రాలలో చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్రలో వైరస్ విజృంభణతో అక్కడ మరోమారు లాక్‌డౌన్ తప్పేలా లేదు. ఇప్పటికే ముంబయితో పాటు టైర్-2, టైర్-3 సిటీలలో లాక్‌డౌన్ నిబంధనలను అమలు చేస్తున్నారు. అమరావతి, ఔరంగాబాద్, జల్నా, యావత్మల్, పూణె, అకోలా వంటి జిల్లాలలో విధించిన పాక్షిక లాక్‌డౌన్‌నూ పొడిగించారు. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి గతంలో విధించిన మాదిరిగా కఠిన లాక్‌డౌన్ తప్పకపోవచ్చనని నిపుణులు భావిస్తున్నారు.

అటు ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా ఉన్న ధారావిలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. గడిచిన 15 రోజులుగా అక్కడ రోజుకు 50కి తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో వైద్యాధికారులు, బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. గతంలో ధారావిలో కరోనా వైరస్‌ను కట్టడి చేసిన మోడల్‌నే మళ్లీ అమలుచేస్తున్నారు. ప్రతి ఒక్కరికి టెస్టులు, కరోనా కేసుల ట్రేసింగ్.. వంటి వాటితో ధారావిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు పుణేలో రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగుతోంది. అటు ఈనెల 14 వరకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఆన్‌లైన్ ద్వారానే విద్యాబోధన జరుగుతోంది. పెరుగుతున్న కేసులతో ముంబైలో మరోసారి లాక్‌డౌన్ విధించే పరిస్థితులు లేకపోలేదని నిపుణులు భావిస్తున్నారు.

Tags

Next Story