తమిళనాడును వణికిస్తున్న నివర్ తుఫాన్

తమిళనాడును వణికిస్తున్న నివర్ తుఫాన్

నివర్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిల్లో కుండపోత వర్షాలు విలయాన్ని సృష్టిస్తున్నాయి. ఇవాళ, రేపు ఆంధ్రాలోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చేసిన హెచ్చరిక నేపథ్యంలో సర్వత్రా ఆందోళన నెలకొంది. బంగాళా ఖాతంలోని తీవ్ర వాయుగుండం మంగళవారం తుఫానుగా మారింది. ఇది మరింత బలపడి తీవ్ర తుఫానుగా దూసుకొస్తోంది. ఇవాళ సాయంత్రం మహాబలిపురం-కరైకల్‌ నడుమ తీరం దాటనుంది. ఇప్పటికే ఈ ప్రభావంతో తమిళనాడులోని 7 జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. చెంగల్‌పట్టు, తిరువన్నామలై, విల్లుపురంలో అతిభారీవర్షాలకు రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. చెన్నైలోనూ పలు ఏరియాలు నీట మునిగాయి. మెరీనా బీచ్‌లో సముద్రం అల్లకల్లోలంగా మారి భయపెడుతోంది. భారీవర్షాల నేపథ్యంలో ఇవాళ తమిళనాడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కి.మీ., అప్పుడప్పుడు 145 కి.మీ. వేగంతో పెనుగాలులతోపాటు భారీగా వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. ఇవాళ,రేపు ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణకోస్తా, రాయలసీమ ప్రాంతంలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఏపీ తీరప్రాంతంలో గంటకు 65-85కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్‌ సూచించారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముందు జాగ్రత్తగా నెల్లూరు జిల్లాకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను తరలించారు.

తీవ్ర తుఫాన్‌ తీరానికి సమీపంగా వచ్చే క్రమంలో సృష్టించే విధ్వంసం తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న ఐఎండీ తమిళనాడుతోపాటు ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలకూ రెడ్‌ మెసేజ్‌ జారీచేసింది. బుధవారం కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. గురువారం కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా, అక్కడక్కడా భారీ నుంచి అతిభారీగా, కర్నూలులో కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్రవారం కూడా దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల, ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. కాగా కోస్తాంధ్రలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. బుధవారం గంటకు 65-75, అప్పుడప్పుడు 85 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది.

ఏపీలోని అన్ని ఓడరేవుల్లో రెండవ నంబరు ప్రమాద సూచిక ఎగురవేశారు. తమిళనాడుకు ఆనుకుని ఉన్న చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో బుధవారం మధ్యాహ్నం నుంచి గాలుల తీవ్రతకు ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉండటంతో బుధవారం చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు, 26న కర్నూలు జిల్లాకు రెడ్‌ మెసేజ్‌ జారీచేశారు. అలాగే, 25న ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాలకు ఆరెంజ్‌ మెసేజ్‌, గుంటూరు నుంచి విశాఖపట్నం వరకు ఉన్న జిల్లాల్లో ఎల్లో మెసేజ్‌ జారీచేశారు. 26న నెల్లూరు నుంచి గుంటూరు వరకు, రాయలసీమలో కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు ఆరెంజ్‌, తూర్పుగోదావరి నుంచి విజయనగరం వరకు ఎల్లో మెసేజ్‌ జారీచేశారు.

'నివర్‌' తీవ్ర తుఫానును ధీటుగా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సహాయక చర్యలు చేపట్టేందుకు తమిళనాడుకు 12, ఏపీకి 7, పుదుచ్చేరికి 3..మొత్తం 22 సహాయక బృందాల్ని పంపినట్టు తెలిపింది. తుఫాను తర్వాత పరిస్థితులన్నీ సాధారణ స్థితికి వచ్చేవరకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ప్రభావిత ప్రాంతాల్లోనే ఉంటాయని స్పష్టం చేసింది.

తమిళనాడులోని చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకూ భారీగా వర్షాలు కురవడంతో పల్లపు ప్రాంతాల్లో నీరు నిలిచి దీవులను తలపిస్తున్నాయి. కడలూరు, విల్లుపురం, నాగపట్టినం, తంజావూరు, నామక్కల్‌, పెరంబలూరు జిల్లాల్లోనూ మంగళవారం ఉదయం నుంచి కుండపోతగా వర్షాలు కురిశాయి. పలు చోట్ల చెట్లు కూలిపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షం నీరు వరదలా జొరబడింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెంబరంబాక్కం జలాశయంలో నీటిమట్టం 22 అడుగులు దాటింది. మరో రెండడుగులు పెరిగితే 2015 నాటి వరద పరిస్థితులు ఏర్పడతాయని చెన్నై నగరవాసులు భీతిల్లుతున్నారు. 'నివర్‌' తీరం దాటే సమయంలో నాగపట్టినం, కారైక్కాల్‌, విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాల్లో గంటకు 120-130 కి.మీ., చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో 80-100 కి.మీ. వేగంతో పెనుగాలులు వీస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. బుధవారం ప్రభుత్వ సెలవుగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. చెంబరంబాక్కం సహా అన్ని రిజర్వాయర్లనూ నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షితంగా శిబిరాలకు తరలిస్తున్నామని అధికారులు తెలిపారు.


Tags

Read MoreRead Less
Next Story