మొన్న కరోనా.. నిన్న స్ట్రెయిన్.. నేడు మరో వైరస్

మొన్న కరోనా.. నిన్న స్ట్రెయిన్.. నేడు మరో వైరస్
దేశవ్యాప్తంగా వైరస్ సోకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కరోనా మహమ్మారితో ఇప్పటికే ప్రజలు వణికిపోతుంటే.. దేశంలో బర్డ్ ఫ్లూ పంజా భయాందోళకు గురిచేస్తోంది. గత కొద్దిరోజులుగా నాలుగు రాష్ట్రాల్లో కాకులు, బాతులు H5 N1 వైరస్‌తో మరణించడంతో అధికారులు మరింత అప్రమత్తయ్యారు. వాటి నమూనాలను వెంటనే పరీక్షించారు. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లోని కాకులు, బాతుల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయినట్లు వెల్లడించడం తీవ్రకలవరపాటుకు గురిచేస్తోంది. అయితే ఈ వైరస్ మరింత విస్తరించే ప్రమాదం లేకపోలేదని వైద్య నిపుణులు అంటున్నారు.

కరోనా కలవరం సద్దుమణగకముందే బర్డ్‌ఫ్లూ దాడిచేయడానికి సిద్దమైంది. రాజస్థాన్‌లో మొదట కనిపించిన ఈ వైరస్ దక్షణ భారత్ లోని కేరళలోను తనప్రతాపం చూపిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా వైరస్ సోకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాజస్థాన్‌లో 11 జిల్లాలోని 425 కాకులు బర్డ్‌ఫ్లూ వైరస్‌తో మరణించినట్లు తేలింది. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లోను కాకులు, బాతులు బర్డ్‌ ఫ్లూ సోకి ప్రాణాలు కోల్పోయాయి. ఒక్క కేరళలోనే ఇప్పటివరకు 12వేలకు పైగా బాతులు మృతిచెందినట్లు తెలుస్తోంది. అలప్పుళ, కొట్టాయం జిల్లాలో వైరస్ ప్రభావం కనిపించింది. దీని కారణంగా వేలాది బాతులు, కోళ్లను చంపెయ్యాల్సి ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు.

హిమాచల్‌ప్రదేశ్‌లోను ఈ వైరస్‌ కల్లోలం రేపుతోంది. అయితే ఇక్కడికి ప్రతియేటా ఈ సీజన్‌లో మధ్య ఆసియా, రష్యా, మంగోలియా నుంచి దాదాపు లక్షల పక్షులు వలస వస్తుంటాయి. ఇప్పటి వరకు దాదాపు 50 వేల పక్షలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వలసవచ్చిన పక్షుల్లో బర్డ్‌ఫ్లూ లక్షణాలు బయటపడటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అయితే ఇప్పటివరకు 2వేల 401 పక్షులు బర్డ్‌ఫ్లూ బారిన పడి చనిపోయాయని.. వాటిల్లో 90% పొడుగు మెడ బాతు జాతికి చెందిన వలస పక్షులని అధికారులు తెలిపారు. దీంతో కంగ్రా జిల్లాలోని పాంగ్‌ డ్యామ్‌ పరిసరాల్లో కిలోమీటరు దూరం వరకు పర్యాటకులపై నిషేధం విధించారు.

పక్క రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూవైరస్ విస్తరించడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. పక్షుల వధ, కోళ్లు, ఇతర పక్షుల మాసం విక్రయాలు, ఎగుమతులు,దిగుమతులపై నిషేధం విధించింది. ఇప్పటికే ఇండోర్ లో 50కి పైగా కాకులు మరణించాయి. వాటి నమునాలను ల్యాబ్‌కు పంపించారు. ఇక తెలంగాణలోని పలుప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో నెమళ్లు మరణిస్తున్నాయి. అయితే ఇవి ఏ కారణంగా మరణించాయన్నది తెలియాల్సింది. వాటి నమూనాలను సేకరించిన అధికారులు ల్యాబ్‌కు తరలించి పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులో కొద్దిరోజులక్రితం 8 నెమళ్లు మరణించాయి..అదేవిధంగా కరీనంగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ పేటలో ఐదు నెమళ్లు మృత్యువాత పడ్డాయి. వీటి మరణంపై అధికారులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతానికి ఇవిమాత్రం క్రిమిసంహారక మందులవల్లే మరణించాయిని అంటున్నారు. అయితే పక్కరాష్ట్రాల్లో విజృంభిస్తున్న బర్డ్‌ఫ్లూ వైరస్ మన పక్షలకు విస్తరించే ప్రమాదం లేకపోలేదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వలస పక్షలు, కాకుల ద్వారా ఇది త్వరగా విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story