ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత.. వంద టన్నుల ఆక్సిజన్ అందించేందుకు ముందుకొచ్చిన అంబానీ

ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత.. వంద టన్నుల ఆక్సిజన్ అందించేందుకు ముందుకొచ్చిన అంబానీ
కరోనా కేసులు పెరుగుతున్న కొద్దీ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిండుకుంటోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత మొదలైంది. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో సైతం ఆక్సిజన్ నిల్వలు నిండుకుంటున్నాయి.

కరోనా కేసులు పెరుగుతున్న కొద్దీ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిండుకుంటోంది. గత కొన్ని రోజులుగా కరోనా కారణంగా ఐసీయూల్లో చేరుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత మొదలైంది. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో సైతం ఆక్సిజన్ నిల్వలు నిండుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడంతో ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్‌ను తెప్పించే పరిస్థితులు కూడా కనిపించడం లేదు.

మెడికల్‌ ఆక్సిజన్‌ను మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, ఢిల్లీ, చత్తీస్‌గఢ్, పంజాబ్, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో అధికంగా వినియోగిస్తున్నారు. అయినప్పటికీ, ఛత్తీస్‌గఢ్, కర్నాటక రాష్ట్రాల నుంచి అవసరమైన లిక్విడ్ ఆక్సిజన్ రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓ వారం రోజులకు సరిపడా ఆక్సిజన్ నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈ వారంలోగా వేరే రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ సిలిండర్లు తెప్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

కరోనా వైరస్‌ కొందరిలో చాలా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. శ్వాస తీసుకోవడం కూడా కష్టమే. అలాంటి వారికి ఆక్సిజన్ తప్పనిసరి. ఇప్పుడున్న డిమాండ్ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోజుకు 100 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.

హైదరాబాద్‌లోని ఒకట్రెండు ఆస్పత్రుల్లోనే లిక్విడ్ ఆక్సిజన్ వ్యవస్థలు ఉన్నాయి. మిగతా హాస్పిటల్స్‌ అన్నీ ఆక్సిజన్ సిలిండర్లనే తెప్పించుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ పెరగడంతో సరఫరా కష్టమవుతోంది. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే.. కేవలం ఆక్సిజన్ సిలిండర్లు లేక పేషెంట్లను చేర్చుకోని పరిస్థితి ఉంది.

ఏపీలోనూ ఆక్సిజన్ కొరత కనిపిస్తోంది. గత రెండు మూడు రోజుల్లోనే ఆక్సిజన్ వాడకం ఐదు రెట్లు పెరిగింది. పేషెంట్ల సంఖ్య పెరుగుతుండడంతో గుంటూరు జిల్లాలో మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత తీవ్రతరమైంది. మార్కెట్లో ఆక్సిజన్ సిలిండర్ల ధర కూడా డబుల్ చేశారు. ఏడు క్యుబిక్‌ మీటర్ల ఆక్సిజన్‌ సిలిండర్‌ ధర 218 రూపాయలు ఉండేది. కాని, రెండురోజుల్లోనే ఏకంగా 450 రూపాయలకు పెంచేశారు.

అయినప్పటికీ తగినంత సరఫరా లేదు. ముఖ్యంగా ఆక్సిజన్ తయారీకి కావాల్సిన లిక్విడ్‌ ఆక్సిజన్‌ కొరత ఉండడమే దీనికి కారణమని తెలుస్తోంది. మరోవైపు మహారాష్ట్రలో కరోనా పేషెంట్ల కోసం అవసరమైన ఆక్సిజన్‌, వెంటిలేటర్లను విశాఖపట్నం నుంచి తెప్పిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ముఖ్యంగా నాగ్‌పూర్‌లో పరిస్థితిని అదుపు చేసేందుకు విశాఖ నుంచి 40 టన్నుల ఆక్సిజన్‌ను తెప్పిస్తున్నామని, వెంటిలేటర్లను కూడా విశాఖలోని మెడికల్‌ డివైజ్‌ పార్క్‌ నుంచి సరఫరా చేయిస్తున్నామని గడ్కరీ తెలిపారు.

కేంద్రం మాత్రం ఆక్సిజన్ కొరత లేదని చెబుతోంది. దేశమంతటా సరిపడా ఆక్సిజన్‌ అందుబాటులో ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం రోజుకు 7వేల 127 మిలియన్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యం ఉందని, త్వరలోనే అవసరానికి మించి ఆక్సిజన్‌ అందుబాటులోకి వస్తుందని తెలిపింది.

అన్ని రాష్ట్రాల్లో జిల్లా స్థాయి వరకు ఆక్సిజన్‌ అందించడానికి కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఆక్సిజన్‌ సరఫరా కోసం సిలిండర్లు, ట్యాంకర్ల కొరత లేకుండ చూడాలని సూచించింది.

మహారాష్ట్రలో దేశంలోనే అత్యధిక కేసులు నమోదవుతుండడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ భారీ సాయం ప్రకటించారు. కరోనా రోగుల కోసం వంద టన్నుల ఆక్సిజన్ అందించేందుకు ముందుకొచ్చారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న రిలయన్స్ రిఫైనరీ ప్రపంచంలోనే పెద్దది. ఈ రిఫైనరీ నుంచి వంద టన్నుల ఆక్సిజన్‌ను మహారాష్ట్రకు సరఫరా చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story