Omicron Variant: అప్రమత్తత ఒక్కటే ఒమ్రికాన్ నుండి మనల్ని కాపాడే అస్త్రం అంటున్న వైద్యులు..

Omicron Variant (tv5news.in)
Omicron Variant: కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. కాగా కరోనా వైరస్‌లో ఇప్పటికే 3.5 లక్షల నుంచి 4 లక్షల మ్యుటేషన్లు జరిగాయని.. కొన్ని బలహీనంగా ఉంటే.. మరికొన్ని బలంగా ఉంటాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. డెల్టా కన్నా ఒమిక్రాన్ తీవ్రత 30 రెట్లు ఎక్కువగా ఉంటుందని.. దేశంలోకి ఈ వైరస్ చేరకుండా జాగ్రత్తపడుతూ తక్కువ నష్టంతో బయటపడాలని సూచించారు.
లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. అత్యంత ప్రమాదకర వేరియంట్‌గా భావిస్తోన్న ఒమిక్రాన్‌లో 30కిపైగా మ్యూటేషన్లు ఉన్నట్లు ఉన్నాయని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా పేర్కొ్నారు. ఈ మ్యుటేషన్లే ప్రమాదకరంగా మారవచ్చని.. ఇదే జరిగితే టీకా సామర్థ్యం కూడా తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లు ఈ వేరియంట్‌ను ఏ మేరకు ఎదుర్కొంటాయనే అంశంపై క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని డాక్టర్ గులేరియా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటించడం, వ్యాక్సిన్ తీసుకోవడంలో ప్రజలు నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు. మరోవైపు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తాజాగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. అంతర్జాతీయ ప్రయాణికులపై గట్టి నిఘా ఉంచి అందరికీ పరీక్షలు చేయించాలని, పాజిటివ్‌గా తేలిన నమూనాలను ల్యాబ్‌లకు పంపాలని సూచించారు. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. కరోనా పరీక్షలు పెంచాలని, వైరస్ సోకిన వారికి తక్షణం వైద్య సేవలు అందించేందుకు వీలుగా మౌలిక వసతులు పెంచుకోవాలని నిర్దేశిస్తూ సూచనలు చేశారు.
హాట్‌స్పాట్‌లను నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు. . కరోనా మూడో దశ ముప్పు తలెత్తితే ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసు నమోదు కాలేదని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి ముప్పు తగ్గుతుందని, ప్రాణాలు కాపాడుకునేందుకు అందరూ టీకాలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
రెండు డోసులు పూర్తిచేసుకున్న ఆరు నెలలకు బూస్టర్‌డోసు అవసరమని, దీనిపై కేంద్ర మార్గదర్శకాలు వచ్చేవరకు ప్రజలు వేచి ఉండాలని ప్రజావైద్యారోగ్యశాఖ కోరింది. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం, ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి హరీశ్‌రావు వైద్యశాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com