Asle Toje: మోదీ మాత్రమే యుద్ధాన్ని ఆపగలరు: నోబెల్ శాంతి బహుమతి కమిటీ సభ్యుడు

Asle Toje: విదేశాంగ విధాన అధికారి, నోబెల్ శాంతి బహుమతి కమిటీ సభ్యుడు అస్లే టోజే భారత పర్యటనలో ఉన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశం సూపర్ పవర్‌గా అవతరిస్తుందని అన్నారు. యుద్ధాన్ని ఆపడంలో ప్రధాని మోదీ అత్యంత విశ్వసనీయ నాయకుడని పేర్కొన్నారు. ఆయన మాత్రమే శాంతిని నెలకొల్పగలరని అన్నారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంలో అణ్వాయుధాలను ఉపయోగించకుండా భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రపంచానికి ఇలాంటి జోక్యాలు మరిన్ని అవసరమని అస్లే టోజే అన్నారు. "అణ్వాయుధాలను ఉపయోగించడం వల్ల కలిగే పరిణామాలను రష్యాకు గుర్తు చేయడానికి భారతదేశం జోక్యం చాలా సహాయకారిగా ఉంది" అని టోజే అన్నారు. “భారతదేశం పెద్ద గొంతుతో మాట్లాడలేదు, ఎవరినీ బెదిరించలేదు, వారు తమ వైఖరిని స్నేహపూర్వకంగా తెలియజేస్తారు. అంతర్జాతీయ రాజకీయాల్లో మనకు ఇది మరింత అవసరం అని అన్నారాయన. నోబెల్ శాంతి బహుమతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అతిపెద్ద పోటీదారు అని పేర్కొన్న ఒక రోజు తర్వాత టోజే ఈ వ్యాఖ్య చేశారు. ప్రధాని మోదీ పాలనను కొనియాడుతూ, ప్రధాని మోదీ విధానం వల్లే భారత్ ధనిక, శక్తిమంతమైన దేశంగా మారుతోందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com