Project Cheetah: భారత్ కు డజన్ల కొద్దీ ఆఫ్రికా చిరుతలు..

ఈ దశాబ్దంలో భారత్ లో చిరుతల సంచారం గణనీయంగా పెరుగనుంది. దక్షిణ ఆఫ్రికా నుంచి డజన్ల కొద్దీ చిరుతలను భారత్ కు తరలనున్నాయి. ఈ మేరకు ఇరు దేశాల మధ్యా సయోధ్య కుదిరింది. ఈ ఎంఓయూ(MoU) మేరకు రాబోయే పదేళ్లలో క్రమంగా చిరుతలను భారత్ అటవీ ప్రాంతానికి తరలించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
ఇప్పటికే 12 చిరుతలు దక్షిణాఫ్రికా నుంచి బయలుదేరాయని అధికారులు వెల్లడించారు. ఈ చిరుతలు ఫిబ్రవరి నాటికి భారత్ కు చేరనున్నాయని తెలుస్తోంది. మధ్యప్రదేశ్ లోని కునో జాతీయ పార్క్ లో వీటిని విడిచిపెట్టనున్నారు. ఈ చిరుతలు నాంబియాకు చెందినవని అధికారులు తెలిపారు. ఏటా 12 చిరుతలను విడతల వారీగా తరలించడమే ధ్యేయమని చెబుతున్నారు.
దక్షిణాఫ్రికా పర్యావర్ణ, అటవీశాఖా మంత్రి బార్బరా క్రీసీ ఈ మేరకు తరలింపు ఒప్పందానికి గతేడాది నవంబర్ లోనే పచ్చజెండా ఊపారని తెలుస్తోంది. అయితే ఆ దేశ అధ్యక్షడి ఆమోదం కోసం ఇన్ని రోజులు నిరీక్షించిన అధికారులు, ఇరు దేశాల మధ్య అధికారిక ఒప్పందం పూర్తవ్వగానే తరలింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టేశారు.
దక్షిణాఫ్రికాతో ఒప్పందం మేరకు భారత అధికారులు చిరుతలను తీసుకువచ్చేందుకు ఆ దేశం పయనమవ్వనున్నారు. తాజాగా వస్తున్న వాటితో మన దేశంలోని చిరుతల సంఖ్య 20కి చేరుకోనుంది.
గతేడాది సెప్టెంబర్ 17న ఎనిమిది చిరుతలను(5ఆడ చిరుతలు, 3 మగ చిరుతలు) మధ్యప్రదేశ్ లోని షేపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్క్ లోకి ప్రవేశ పెట్టారు. దేశంలో వేటగాళ్లు, పర్యావరణం అనుకూలించకపోవడం వల్ల, వేటగాళ్ల విపరీత చర్యల వల్ల చిరుతలు పూర్తిగా కనుమరుగైన సంగతి తెలిసిందే. 1952లో దేశంలో చిరుతలు పూర్తిగా అంతరించిపోయాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
తిరిగి 1970ల్లో చరిత్రాత్మక ప్రాంతాల్లో కొన్ని జాతులను తిరిగి పునరుద్ధరించాలన్న ఆలోచనతో భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలే దక్షిణాఫ్రికాతో తాజా ఒప్పందానికి దారి తీసిందని చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com