Deep Sidhu: రైతుల నిరసనలో పాల్గొని యాక్టివిస్ట్‌గా మారి.. ఎవరీ దీప్ సిద్ధూ..

Deep Sidhu:  రైతుల నిరసనలో పాల్గొని యాక్టివిస్ట్‌గా మారి.. ఎవరీ దీప్ సిద్ధూ..
Deep Sidhu: 2021లో రైతులను నిరసిస్తూ రిపబ్లిక్ డే ట్రాక్టరీ ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాకాండకు దీప్ సిద్ధూ కీలక సూత్రధారి అని ఆరోపణలు వచ్చాయి.

Deep Sidhu: రైతుల నిరసనలో పాల్గొని యాక్టివిస్ట్‌గా మారిన దీప్ సిద్ధూ..మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలో చురుగ్గా పాల్గొన్న ప్రముఖ పంజాబీ నటుడు దీప్ సిద్ధూ మంగళవారం రోడ్డు ప్రమాదంలో మరణించారు.

పంజాబీ నటుడు, రైతు ఉద్యమకారుడు దీప్ సిద్ధూ మంగళవారం ఢిల్లీ నుంచి బటిండా వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించారు. వైట్ స్కార్పియో వాహనంలో అతడు తన సన్నిహితురాలు రీనా రాయ్‌తో కలిసి ప్రయాణిస్తున్నాడు.

మోడల్, నటుడు మరియు రైతు ఉద్యమకారుడు అయిన దీప్ సిద్ధూకు 37 సంవత్సరాలు. పంజాబ్‌లోని ముక్త్‌సర్ సాహిబ్ జిల్లాకు చెందినవాడు. మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. 2015లో నటుడు ధర్మేంద్ర నేతృత్వంలోని విజేత ఫిల్మ్‌ నిర్మించిన తన మొదటి చిత్రం రామ్తా జోగి ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేశాడు. దీప్ సిద్ధూ ఎనిమిది పంజాబీ చిత్రాల్లో నటించారు. అయితే, అతను 2018లో 'జోరా 10 నంబారియా'లో గ్యాంగ్‌స్టర్ పాత్రను పోషించిన తర్వాత పాపులర్ అయ్యాడు.

రైతు నిరసనలో దీప్ సిద్ధూ పాల్గొన్నారు. రైతుల ఆందోళనకు మద్దతుగా ఇంగ్లీషులో మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీప్ సిద్ధూ వెలుగులోకి వచ్చారు. 2021లో రైతులను నిరసిస్తూ రిపబ్లిక్ డే ట్రాక్టరీ ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాకాండకు దీప్ సిద్ధూ కీలక సూత్రధారి అని ఆరోపణలు వచ్చాయి.

ఎర్రకోట వద్ద గందరగోళానికి ఆజ్యం పోశాడని పోలీసులు కూడా ఆరోపించారు. ఫిబ్రవరి 9 , 2021న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. 70 రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉన్న తర్వాత ఏప్రిల్ 17న బెయిల్‌పై విడుదలయ్యాడు. ఎర్రకోట హింస కేసులో దీప్ సిద్ధూపై ఢిల్లీ పోలీసులు మే 2021లో 3,000 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు.

దీప్ సిద్ధూ 2019 సార్వత్రిక ఎన్నికల్లో నటుడు-రాజకీయవేత్త సన్నీ డియోల్ కోసం ప్రచారం చేశారు. కానీ సన్నీ డియోల్ ఆ తర్వాత దీప్ సిద్ధూని పట్టించుకోలేదు. దీప్ సిద్ధూ తరచుగా హతమైన ఖలిస్తానీ నాయకుడు జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేను బహిరంగంగా ఉటంకిస్తూ కనిపించాడు. దళితుల మనోభావాలను దెబ్బతీసినందుకు జలంధర్ పోలీసులు 2021 అక్టోబర్‌లో నమోదు చేసిన ఎస్సీ/ఎస్టీ చట్టం కింద అతడిపై కేసు నమోదు చేశారు.

దీప్ సిద్ధూ, సెప్టెంబర్ 2021లో, రాష్ట్రాల సమాఖ్య హక్కుల కోసం పోరాడేందుకు 'వారిస్ పంజాబ్ దే' పేరుతో ఒక సంస్థను కూడా ఏర్పాటు చేశారు. నటుడిగా కంటే ప్రజలపై సమస్యలపై పోరాడిన వ్యక్తిగా దీప్ సిద్ధూ పేరు గడించాడు.

రోడ్డు ప్రమాదంలో దీప్ సిద్ధూ ప్రాణాలు కోల్పోయినప్పటికీ, అతని స్నేహితురాలు రీనా రాయ్ ప్రాణాలతో బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రీనా కారుకు ఎడమవైపు ఉండడం వల్ల పెద్దగా నష్టం వాటిల్లలేదు. ప్రమాదం జరిగిన వెంటనే రీనా పక్కన ఉన్న ఎయిర్‌బ్యాగ్ తెరుచుకోవడంతో ఆమె ప్రాణాలతో బతికి బయటపడింది. రీనా సీట్‌బెల్ట్ ధరించి ఉంది. ప్రమాద సమయంలో ఎయిర్‌బ్యాగ్ తెరుచుకున్నా పగిలిపోలేదు. కానీ దీప్ సిద్ధూ విషయంలో ఎయిర్ బ్యాగ్ పేలింది. ప్రమాదం తర్వాత రీనా తలకు, ఛాతీ ప్రాంతంలో తీవ్రమైన గాయాలు అయినా ఎయిర్‌బ్యాగ్ రక్షించి, ఆమె ప్రాణాలను కాపాడింది.

Tags

Read MoreRead Less
Next Story