దేవుడు శాసించాడు...రజనీ రాజకీయాల్లోంచి తప్పుకున్నాడు.!

దేవుడు శాసించాడు...రజనీ రాజకీయాల్లోంచి తప్పుకున్నాడు.!
సారీ.. ఇక నేను పాలిటిక్స్‌లోకి రాను అంటూ పెద్ద షాక్‌ ఇచ్చారు సూపర్‌స్టార్.

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తన రాజకీయ అరంగేట్రంపై సంచలన ప్రకటన చేశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా పార్టీ పెట్టట్లేదని స్పష్టం చేశారు. అయితే రాజకీయాలతో సంబంధం లేకుండా తన ప్రజాసేవ కొనసాగుతుందని వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా అభిమానులకు మూడు పేజీల లేఖ విడుదల చేశారు. ప్రస్తుత కొవిడ్‌ పరిస్థితుల్లో పార్టీ ప్రారంభించకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. పార్టీ కంటే ఆరోగ్యం ప్రాధాన్యమని ఆత్మీయులు సూచించారని తెలిపారు. ఎంతో భారమైన హృదయంతో ఈ నిర్ణయం ప్రకటిస్తున్నట్లు చెప్పారు తలైవా.

ఇటీవల అన్నాత్తె సినిమా షూటింగులో ఉన్నసమయంలో రజనీ ఆరోగ్యం క్షీణించింది. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో 3 రోజులపాటు చికిత్స పొందారు.అధిక రక్తపోటుతో కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరించడంతో పార్టీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించారు సూపర్ స్టార్. అన్నాత్తె సినిమా షూటింగ్‌లో నలుగురికి కరోనా పాజిటివ్ వస్తే.. 120 మందికి కరోనా పరీక్షలు చేయించాల్సి వచ్చిందని, ఈ సమయంలో పార్టీ పెడితే లక్షల మంది జనం తరలివస్తారని చెప్పారు. పైగా స్ట్రెయిన్‌ వైరస్‌ మరింత ఆందోళన కలిగిస్తుండడంతో అభిమానులను బలిపశువులను చేయదలచుకోలేదని అన్నారు. తన ప్రాణం కంటే.. తనను నమ్మే అభిమానుల ప్రాణాలే ముఖ్యం అంటూ లెటర్‌ రాశారు. రాజకీయాల్లోకి రాకుండానే ప్రజలకు సేవ చేస్తానని స్పష్టం చేశారు రజనీ. అనారోగ్యం కారణంగా తాను నటిస్తున్న అన్నాత్తె సినిమా షూటింగ్ ఆగిపోయిందని.. ఈ కారణంగా చాలామంది ఉపాధి కోల్పోయారని అన్నారు. ఒకవేళ తాను రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ప్రజలను కలవాల్సి ఉంటుందన్న తలైవా.. ఒకవేళ తనకు ఏమైనా జరిగితే తనను నమ్ముకున్న వాళ్లు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు మానసిక ప్రశాంతత కోల్పోతారని అన్నారు.

సినిమా షూటింగ్‌కు కూడా వెళ్లొద్దని కుటుంబసభ్యులు వారించినా హైదరాబాద్‌ వెళ్లానని, అన్ని నిబంధనలు పాటించినా అనారోగ్యానికి గురయ్యానని చెప్పుకొచ్చారు రజనీ. దీంతో ఇచ్చిన మాటకు కట్టుబడి, ఇటువంటి సమయంలో రాజకీయల్లోకి రావాలా వద్దా అనే సందేహం పుట్టుకొచ్చిందని అన్నారు.రజినీకి 2017లో కిడ్నీ మార్పిడి చేశారు. వయసు 70 ఏళ్లు కావడంతో ఆరోగ్యంపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు . బహిరంగ వేదికలపై జరిగే కార్యక్రమాలను కూడా తగ్గించారు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అన్నాత్తే షూటింగ్‌లో పాల్గొని అనారోగ్యం బారిన పడ్డారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్, తీవ్ర స్థాయిలో బీపీ, వృద్ధాప్య కారణాల రీత్యా విశ్రాంతి తీసుకోవాల్సిందేనని వైద్యులు సూచించారు. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడికి గురయ్యే పనులను దూరంగా ఉండాలని, కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. దీంతో అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్న రజనీ.. ఏకంగా పొలిటికల్‌ ఎంట్రీని కూడా శాశ్వతంగా మూసేశారు.

రజనీ లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా వద్దామని చూశారు. డిసెంబర్‌ 31న డేట్‌ ఫిక్స్‌ చేసి.. నేను రెడీ అంటూ ప్రకటించారు. 'మక్కల్‌ సేవై కట్చి' పేరుతో ఎన్నికల సంఘంలో పార్టీని నమోదు చేసినట్లు, ఆయనకు ఆటో గుర్తు కేటాయించినట్లు కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. అంతేగాక, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో రజనీ పార్టీ పోటీకి దిగుతుందనే వార్తలు కూడా వచ్చాయి. దీంతో తమిళనాట ఆయన అభిమానులు సంబరాల్లో మునిగితేలారు. కాని, ఆరోగ్యం సహకరించని కారణంగా రాజకీయ ప్రవేశంపై రజనీ ఒక్కసారిగా వెనక్కి తగ్గారు.

Tags

Next Story