RVM: రిమోట్ ఓటింగ్ మెషిన్లు వచ్చేశాయి.

హైద్రాబాద్
RVM: రిమోట్ ఓటింగ్ మెషిన్లు వచ్చేశాయి.
ఎక్కడున్నా మీ ఊర్లో ఓటేయొచ్చు; కొండ ప్రాంత ఓటర్లకు వరం; ఉపాధి కూలీలు ఇకపై ఓటు వేయవచ్చు; 2019లో ఓటు వినియోగించుకోని వారు 30 శాతం; అమల్లోకొస్తే మారనున్న ఓటింగ్, ప్రచార ధోరణి.


మీ ఓటు ఊళ్లోవుందా.. హైదారాబాద్ లోనో మరోచోటో జాబ్ వల్ల ఓటుహక్కును వినియోగించుకోలేకపోతున్నారా.. ఎన్నికల కమిషన్ అందుకు ఓ పరిష్కారం తీసుకొచ్చింది. ఇప్పుడు వలస వెళ్లిన ఓటర్లు వాళ్లున్న చోటు నుంచే తమ స్వంత ప్రాంతాల్లో జరిగే ఎన్నికల్లో పాల్గొనొచ్చు. తద్వారా దూరాభారం వల్లో , సమయం లేకో ఓటు హక్కు వినియోగించుకోలేని వారికి కూడా ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం సుగమమైంది.


ఓటు వినియోగించుకోని వారు 30శాతం.

దాదాపు 30 శాతం ఓటర్లు 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేక పోయారట. జీవనోపాధికోసం వేరే ప్రాంతాలకు వలస వెళ్లినవారూ, మారు ప్రాంతాల్లో వుండే ఓటర్లు, ఒక్కరోజు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వేల రూపాయలు ఖర్చు చేయలేని వారూ ఇలా చాలా మంది తమ ఓటు ఆయుధాన్ని వినియోగించుకోకుండానే ఉండిపోతున్నారు. ఇందువల్ల ప్రజస్వామ్యంలో ప్రభుత్వాలను ఎన్నుకునే అధికారం ప్రజలకేవున్నా మూడో వంతు ఓటర్లు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు.


వీరిలో చాలామందికి ఓటు హక్కుపై అవగాహన లేక, కొంతమందికి వున్నా ఉద్యోగం, చదువులు, ఇతర పనుల కారణంగా ఓటింగ్ రోజున హాజరుకాలేని వారూ ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ల రూపంలో ఓటు వినియోగించుకునే అవకాశం కేవలం కొద్దిమందికే వుంది. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి. ఓటు వేయాలంటే ఖచ్చింతంగా తమ ఓటు రిజిస్టర్ చేసుకున్న ఊళ్లోనే స్వయంగా పోలింగ్ స్టేషన్ కు వెళ్లి వినియోగించుకోవాలన్న నిబంధనలు రిమోట్ ఓటింగ్ కి అవకాశం లేకుండా చేసాయి.


కోర్టు జోక్యంతో ప్రారంభం.

2015 సం. లో వివిధ రాష్ట్రాల్లో ఉపాధి కోసం వలస వెళ్లిన ఓటర్లకు వారుంటోన్న ప్రాంతాల్లో ఓటు హక్కువినియోగించుకునే అవకాశమివ్వాలని కొందరు కోర్టును ఆశ్రయించారు. దీనికి పరిష్కారం కనుగొనే మార్గాలపై అన్వేషించాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల కమిషన్ కు సూచించింది. దానిపై ఎన్నికల కమిషన్ కూడా ప్రత్యామ్నాయ మార్గాలపై రాజకీయ పార్టీలనుంచి పలు సలహాలూ, సూచనలూ స్వీకరించింది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకోవడం, ఆన్ లైన్ లో ఓటు వేసే అవకాశం ఇవ్వడం, పోలింగ్ తేదీకి ఓ వారం ముందునుంచే కుదిరిన రోజున ఓటు వేసే అవకాశమివ్వడం, ఓటరు తరఫున అధీకృత వ్యక్తులు ఓటేయడం వంటివి వాటిలో కొన్ని కానీ ఎన్నికల కమిషన్ వాటిని పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. వాటివల్ల ఎలాంటి ఒత్తిడులకూ లోనుకాకుండా, పారదర్శకంగా ఓటు వినియోగించుకునే వాతావరణం సాధ్యం కాదని అనుమానాలు వ్యక్తంచేసింది. అందుకే సాధారణ ఓటు వినియోగించుకనే వాతావరణం ఏర్పాటు చేసే మరో ప్రత్యామ్నాయంగా రిమోట్ ఓటింగ్ మెషిన్ ను రూపొందించాలని భావించింది.


సీఈసీని 18 కిమీ లు నడిపించిన పోలింగ్ కేంద్రం.

గత సంవత్సరం ఉత్తరాఖండ్ ఎన్నికల ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమారు కొండ ప్రాతాల్లో ఉన్న ఓ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించేందుకు 18 కి.మీలు కాలినడకన వెళ్లాల్సొచ్చిందట. అప్పడు ఆయనకు రిమోట్ ఓటింగ్ మిషిన్ల అవసరం తెలిసిందట. ఒక్క ఓటు వేసేందుకు ఇంత రిస్క్ తీసుకుని ఓటు పై అంతంత మాత్రం అవగాహణఉన్న గిరిజనులు ఎందుకు రిస్క్ తీసుకుంటారు. అవగాహణ ఉన్నా ఇంత సమయం, శ్రమ తీసుకుని ఎవరొస్తారు అందుకే దీనికి పరిష్కారం కనుక్కోవాలనే ప్రయత్నం ముమ్మరమైంది. దాంతో ఐఐటీ మద్రాస్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఈసీఐఎల్ వంటి సంస్ధల సాంకేతిక సహకారంతో రిమోట్ ఓటింగ్ మెషిన్లు ( ఆర్.వి.ఎం.) రూపొందించింది.


రిమోట్ ఓటింగ్ మెషిన్ ( ఆర్.వి.ఎం) ఎలా పనిచేస్తుంది.

ఇప్పటి వరకూ వినియోగించిన ఈవీఎం ల వంటివే ఇవికూడా కాకపోతే ఇవి ఒక్కో ఆర్.వీ.ఎం యంత్రాలు. కాకపోతే ఒక్కో ఆర్.వి.ఎం ద్వారా 72 నియోజకవర్గాల్లోని ఓటర్ తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ప్రతీ రాష్ట్రంలో ఇలా బాయటి ప్రాంతాల వారికోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలింగ్ కేంద్రాల్లో వీటిని ఉంచుతారు. ఏ నియోజగవర్గ ఓటరు ఏ పోలింగ్ బూత్ లో ఓటు వేయవచ్చో ముందే నిర్దేశిస్తారు. ఓటరు ఐడీ కార్డ్ చూసి పోలింగ్ ఆఫీసర్ వారిని ఆ పోల్ బూత్ లోకి అనుమతిస్తారు. ఆర్.వి.ఎం లో వుండే డైనమిక్ డిస్ప్లే ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఓటర్ ఐడీ కార్డుపై ఉండే బార్ కోడ్ ఆధారంగా అభ్యర్ది నియోజకవర్గం, ఓటు నమోదిత పోలింగ్ కేంద్రం వంటివి డిస్ప్లే అవుతాయి. అభ్యర్దుల పేర్లు, గుర్తులు చూసుకుని ఓటు వేయవచ్చు. దీనికి ముందు చేయాల్సిందల్లా పోలింగ్ తేదీ నాటికి మనం ఏ ప్రాంతంలో ఓటు వేయాలనుకుంటున్నామో తెలియజేయాలి. ఆన్లైన్లో చేసిన మన అప్లికేషన్ మన ఓటరు ఐడీ ఆధారంగా స్వగ్రమల్లో మన ఓటును వెరిఫై చేసుకున్న తర్వాత మన అభ్యర్దనను ఎన్నికల కమిషన్ ఆమోదిస్తుంది.


సవాళ్లూ చాలానే వున్నాయి.

ఎన్నికల కిమిషన్ నిబందనలు మార్చితేకానీ ఈ కొత్త వెసులుబాటు అమల్లోకి రాదు. ప్రావాసీ ఓటరు ముందే ఎలా తమ ఓటును నమోదు చేసుకోవాలి. వలస ఓటరు అంటే ఎవరనే అంశం కూడా నిర్వచించాల్సివుంది. ప్రవాసంలో ఉంటూ ఓటు వినియోగించుకోవాలంటే ఎంతకాలం వుంటే ఈ అవకాశం ఇవ్వొచ్చు, నియోజకవర్గం వెలుపల ఉన్న వారు అంటే జిల్లా ప్రాతిపదిక వుంటుందా.. లేదా రాష్ట్ర వెలుపలివారికే ఈ ఇవకాశం ఇస్తారా.. అనేవి ప్రాధమిక సవాళ్లు . వీటితోపాటు ఓటు నమోదు ప్రక్రియ ఇక పై మరింత జఠిలం కాబోతోంది. గోప్యత, ఓటరుకు బదులు ఇతరులు ఓటేసే ప్రమాదం నివారించడం, ఏ ప్రాంతంలో ఎన్ని ఓట్లు నమోదయ్యాయి ముందే అంచానా వేసుకోవడం, ఆయా ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమలు చేయడం వంటివి మరికొన్ని సవాళ్లు.


మరి పార్టీలేమంటాయి.

వసల ఓటర్ల ఓటింగ్ పార్టిసిపేషన్ పెంచే ఈ కొత్త విధానం పై ముందుగా రాజకీయ పార్టీలకు అవగాహణ కల్పించి వారి సలహా సూచనలు కోరింది ఎన్నికల కమిషన్. దేశంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు డిసెంబర్ 29 తేదీనే దీనికి సంబందించిన సాంకేతిక, న్యాయపరమైన, ఇతర సమాచారాన్ని వారికి అందించడంతోపాటు జనవరి 16వ తేదీన ఆర్.వి.ఎం లపై ఓ డెమో కూడా ఇస్తోంది. వాటిపై జనవరి 31లోగా తమ అభిప్రాయాలు, సూచనలు కోరుతోంది. గతంలో ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ మెషిన్లను తెచ్చేముందు కూడా ఈ తరహా అవగాణ కార్యక్రమంలో పార్టీలు సూచించిన పలు సవరణలు చేసారు. చూడాలి ఈసారి ఈ కొత్త రిమోట్ ఓటింగ్ మెషిన్ లపై రాజకీయ పార్టీలు ఏం చెబుతారు, ఏం సూచిస్తారో



Pradeep kumar Bodapatla

Input Editor, tv5

Tags

Read MoreRead Less
Next Story