జాతీయం

నాలుగేళ్ల తర్వాత నేడు విడుదల కానున్న శశికళ

జైలు నుంచి చెన్నై వరకు కనీసం వెయ్యి వాహనాలతో స్వాగతం పలికేందుకు అమ్మ మక్కల్‌ మున్నేట్రకళగం పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు.

నాలుగేళ్ల తర్వాత నేడు విడుదల కానున్న శశికళ
X

అక్రమాస్తుల కేసులో జైలు జీవితం అనుభవిస్తున్న తమిళనాడు చిన్నమ్మ.. ఎట్టకేలకు విడుదలకానున్నారు. నాలుగేళ్ల తర్వాత శశికళ.. ఇవాళ విడుదల కాబోతున్నారు. అయితే కరోనా బారినపడడంతో ప్రస్తుతం బెంగళూరు విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విడుదల ప్రక్రియను ఆస్పత్రిలోనే పూర్తి చేయనున్నారు జైలు అధికారులు.

శశికళకు ఈ నెల 20న ఆర్టీపీసీఆర్ పరీక్షలో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆ తర్వాత నెగెటివ్ వచ్చింది. మరో టెస్ట్‌లో మాత్రం మళ్లీ పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె విక్టోరియా ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ జైలు నుంచి విడుదల అయినప్పటికీ.. ఆస్పత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జి అవుతారన్నది తెలియాల్సి ఉంది. శశికళను బెంగళూరు నుంచి తమిళనాడులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే శశికళకు ప్రస్తుతం కరోనా లక్షణాలు వైద్యులు చెబుతున్నారు. కానీ కోవిడ్‌ ప్రోటోకాల్‌ ప్రకారం 10 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక శశికళ జైలు నుంచి విడుదల కాగానే భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు ఆమె అనుచరులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరప్పణ అగ్రహారం జైలు నుంచి చెన్నై వరకు కనీసం వెయ్యి వాహనాలతో స్వాగతం పలికేందుకు అమ్మ మక్కల్‌ మున్నేట్రకళగం పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు.

తమిళనాడు మాజీ సీఎం జయలలితకు ఆప్తురాలిగా ఉన్న వీకే శశికళ.. 66 కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో జైలుపాలయ్యారు. ఈ కేసులో నాలుగేళ్ల జైలు శిక్షపడింది. 2017 ఫిబ్రవరి నుంచి బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఇదే కేసులో శశికళ బంధువులు జే.ఇళవరసి, బీ.ఎన్ సుధాకర్‌కు కూడా శిక్షపడింది. ఇదిలా ఉంటే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకున్న సమయంలోనే శశికళ జైలు నుంచి విడుదలవుతుండటం ఆసక్తికి తెరలేపింది. తమిళనాడులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

Next Story

RELATED STORIES