Moi Virundhu: చదివింపుల విందు.. ఒక్కరి కోసం ఊరంతా కలిసి..

Moi Virundhu: చదివింపుల విందు.. ఒక్కరి కోసం ఊరంతా కలిసి..
Moi Virundhu: ఎవరిదో ఈ ఆలోచన ఎంత బావుంది.. ఎవరికి వస్తేనేం.. మంచి ఆలోచన నలుగురికీ ఉపయోగపడుతుంది.. ఒక్కరి సమస్యని ఊరంతా పంచుకుంటారు..

Moi Virundhu: ఎవరిదో ఈ ఆలోచన ఎంత బావుంది.. ఎవరికి వస్తేనేం.. మంచి ఆలోచన నలుగురికీ ఉపయోగపడుతుంది.. ఒక్కరి సమస్యని ఊరంతా పంచుకుంటారు.. దాంతో సంబంధాలు బలపడతాయి.. ఊరంతా ఒకేతాటిపై నిలుస్తారు.

ఏదైనా సమస్య ఎవరికి చెప్పుకోవాలి.. ఎవరి మీద ఆధారపడాలి.. లక్షలతో వ్యవహారం అంత డబ్బు వాళ్ల దగ్గర ఉండొద్దు.. ఆలోచనలతో బుర్ర వెడెక్కిపోతుంది.. అదే తమిళనాడులో అయితే నీ కష్టం నీ ఒక్కడితే కాదు.. మాది కూడా అని అందులో పాలుపంచుకుంటారు. సదురు వ్యక్తి సమస్య ఇట్టే తీరిపోతుంది చదివింపుల విందు దానికి పరిష్కార మార్గాన్ని చూపుతుంది.


ఆపద సమయంలో స్నేహితులు. కుటుంబ సభ్యుల కోసం ఒక విందు ఏర్పాటు చేస్తారు. 50 ఏళ్లుగా, కొన్ని వందల కుటుంబాలు విందును నిర్వహించి డబ్బును సేకరిస్తున్నాయి. గజ తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాల తర్వాత వాటి సంఖ్య ఇంకా పెరుగుతోంది.

తంజావూరు, పుదుకోట్టై, మదురై జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో ఈ సంప్రదాయం ప్రజాదరణ పొందింది. ప్రతి సంవత్సరం విందుల సంఖ్యతో పాటే చదివింపుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఎంతగా అంటే విందు ఇచ్చే కుటుంబాలు వచ్చిన నగదును భద్రపరచడానికి బ్యాంకులను కూడా ఆశ్రయిస్తున్నాయి. నగదు సహాయం చేసిన వారి వివరాలను నమోదు చేయడానికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్ కూడా తీసుకువచ్చారు.


విందుకు ఆహ్వానించేవారు కూడళ్ల వద్ద పెద్ద పెద్ద బ్యానర్లు, ప్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్నామనే బ్యానర్ ఒకటైతే, వ్యాపారం చేయాలనుకుంటున్నాను.. సాయం అందిస్తే సంతోషం అని కనిపించే బ్యానర్ మరొకటి.. నిజానికి ఎవరికైనా సాయం చేయడం వారు మనకు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావించాలి.

వారికి సాయం చేసే అంత డబ్బు మన దగ్గర ఉండడం మన అదృష్టంగా భావించాలి. సాయం అందుకున్న వారు ఊరికే ఏం తీసుకోరు.. ఇచ్చిన గడువులోగా మళ్లీ తిరిగి ఇచ్చేస్తారు. కాకపోతే వడ్డీ ఉండదు. నమ్మకమే వారిని నడిపిస్తుంది. చదవింపుల విందును ముందుకు నడిపిస్తుంది.


తమిళంలో మొయి విరుందు అని పిలుచుకునే ఈ విందులో పండుగ వాతావరణం కనిపిస్తుంది.. వచ్చిన వారికి ఏదో ఒకటి పెట్టి హమ్మయ్య అనుకోరు. మంచి రుచికరమైన వేడి వేడి భోజనం వడ్డిస్తారు. ఇందుకోసం 17 మంది పని చేస్తుంటారు. ఎక్కడ చదివింపుల విందు జరిగినా ఈ టీమ్ వెళ్లిపోతుంది.

ఒక విధంగా వీరందరికీ ఉపాధి దొరికినట్లే. కరోనా తరువాత ఈ విందు కార్యక్రమాలు తగ్గినా ఇప్పుడు మళ్లీ ఊపందుకుంది. తంజావూరు జిల్లాలోని పెరవూరని, పుదుక్కొట్టె జిల్లాలోని కీరమంగళం రెండు జిల్లాల సరిహద్దుల్లో ఉంటాయి. ఈ గ్రామాల్లో ఇప్పుడు చదివింపుల విందు సందడి బాగా కనిపిస్తోంది.

2019లో ఓ వ్యక్తి మటన్ కర్రీ, చికెన్ ప్రైతో మాంచి చదివింపుల విందు ఇచ్చారు. విందుకు వచ్చిన వారు కూడా ఆయనకు బాగానే చదివింపులు అందించారు.. అందరూ వెళ్లిన తరువాత లెక్క చూసుకుంటే 4కోట్లు తేలింది. ఆ డబ్బు చూసి ఆయనకే ఆశ్చర్యం వేసింది. చాలా గ్రామాల్లో ఈ విందులకు తేదీలు నిర్ణయించుకుని ముందుగానే ఫిక్స్ చేసుకుంటారు.


విందుకు పిలిచే వారు ఆహ్వానపత్రికలు కూడా వేయించడం, బ్యానర్లు కట్టడం, హాలు బుక్ చేయడం వంటి ఏర్పాట్లన్నీ భారీగా ఉంటాయి. తమిళనాట ఈ విందులు సాధారణంగా జులై-ఆగస్టు మధ్యలో వచ్చే తమిళ ఆడి మాసంలో జరుగుతుంటాయి.

ఒకేసారి ఎక్కువమంది కూడా ఇలాంటి విందులు ఇవ్వకూడదు.. దానికి కూడా ఒక రూల్ ఉంటుంది. ఒకరు ఒకసారి ఇస్తే ఐదేళ్ల తరువాతే మరొకరు ఇవ్వాలి. ఇదంతా గ్రామస్థులే కలిసి నిర్ఱయించుకుంటారు.

ఇంతకు ముందు వ్యక్తిగత విందులు ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఉమ్మడి విందులు ఇస్తున్నారు. విందుకు సంబంధించిన ఖర్చులు పంచుకుంటారు. అలాగే వచ్చిన చదివింపులను కూడా పంచుకుంటారు. ఆ విధంగా ఒకేసారి ఎక్కువమంది అవసరాలు తీరుతాయి.

వ్యాపారం ప్రారంభించడానికి, ఇల్లు కట్టుకోవడానికి, పెళ్లిళ్లు లాంటి శుభకార్యాలు చేయడానికి, పిల్లల పై చదువులకు ఇలా ఎన్నో అవసరాలకు ఆదుకుంటుంది ఈ చదివింపుల విందు.. అన్నిటికంటే మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ విందు ఇవ్వాలనుకునేవారికి ఖర్చుల కోసం బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వడం.

ఈ విందులో ఎవరెవరు ఎంత ఇచ్చారో రాసుకుని వాళ్లందరికీ అయిదేళ్లలోపు తిరిగి ఇచ్చేస్తారు. అందుకే ఇది సంప్రదాయ విందు మాత్రమే కాదు, కలిసి ఉంటే ఎంత ప్రయోజనమో తెలియజేస్తుంది.


విందులతో కొత్తగా ఉపాధి అవకాశాలు కూడా వస్తున్నాయి. కార్డులు వేసే వారికి, వంట వాళ్లకి, చదివింపులు రాసేవారికి అందరికీ పని కల్పించబడుతుంది. ఫలితంగా వారు కూడా ఎంతో కొంత సంపాదించుకుంటున్నారు.

అవసరానికి అడగడం తప్పుకాదుకానీ, చెప్పిన సమయానికి తిరిగి ఇవ్వడంలోనే ఆ వ్యక్తి మంచితనం నిలుస్తుంది. 50 ఏళ్లుగా సక్సెస్ ఫుల్ గా ఈ చదివింపుల విందు సాగుతుందంటే తీసుకున్నవారు తిరిగి ఇచ్చేయబట్టే కదా. ఏదేమైనా తమిళ తంబీలకు హ్యాట్సాఫ్. తమకు మంచిదనిపిస్తే మూకుమ్మడిగా ప్రయత్నిస్తారు, కలిసి సాధించుకుంటారు.

Tags

Read MoreRead Less
Next Story